Begin typing your search above and press return to search.

ఆది - కోన లు లాజిక్ మిస్ అయ్యారే!

By:  Tupaki Desk   |   27 Aug 2018 11:21 AM GMT
ఆది - కోన లు లాజిక్ మిస్ అయ్యారే!
X
ఒక సినిమా సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అందులో కంటెంట్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. దీంట్లో వాదనకు అవకాశం లేదు. అది వంద కోట్లతో తీసిన బాహుబలి లాంటి సినిమా కావొచ్చు లేదా జస్ట్ 2 కోట్లతో పూర్తి చేసిన ఆరెక్స్ 100 కావొచ్చు. ఫైనల్ గా సక్సెస్ ఇక్కడ విజేత. అది అందుకున్నవాడికే సింహాసనం. అంతే తప్ప మేము కష్టపడి తీసాం కాబట్టి మాది ఖచ్చితంగా జనం మెచ్చిన సినిమా అంటే సరిపోదు. ఏదైనా 24 క్రాఫ్ట్స్ కష్టపడే తీస్తాయి. ఇందులో దేనికీ మినహాయింపు ఉండదు. బడ్జెట్ ని బట్టి కష్టంలో కాస్త అప్ అండ్ డౌన్ ఉండవచ్చు ఏమో కానీ మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి కారణం నీవెవరో సక్సెస్ మీట్ లో రచయిత కోన వెంకట్ తో పాటు హీరో ఆది పినిశెట్టి చేసిన కామెంట్స్ గురించి. తాము సినిమా తీసింది ప్రేక్షకుల కోసమని రివ్యూలు రాసే వాళ్ళను మెప్పించడం మా టార్గెట్ కాదని కోన వెంకట్ సెలవిచ్చారు. ఇది ముమ్మాటికీ నిజం. కథ ఓకే చేయటం మొదలుకుని గుమ్మడి కాయ కొట్టే దాకా అందరి లక్ష్యం ప్రేక్షకుడి సంతృప్తి మాత్రమే. ఇది తాము రివ్యూలు రాసేవాళ్ళ మీద ఎటాక్ కాదని కేవలం మిక్స్ డ్ రివ్యూల వల్ల అసంతృప్తి కలుగుతోందని చెప్పారు.

ఇక ఆది పినిశెట్టి సైతం పాప్ కార్న్ తో థియేటర్ లో అడుగు పెట్టే వాళ్ళ కోసం తప్ప పెన్ పేపర్ తీసుకుని వచ్చే వాళ్ళ కోసం కాదని చెప్పడం కూడా బాగానే ఉంది. కానీ రివ్యూ రైటర్లు వ్యక్తం చేసేది తమలో ఉన్న ప్రేక్షకుడి అభిప్రాయమే తప్ప మరొకటి కాదనే సంగతి మర్చిపోకూడదు. అది వృత్తిలో భాగమే కావొచ్చు. అదైనా ఏ సినిమాను నెగిటివ్ కోణంలోనే చూడమని చెప్పదు. అలా అని అందరు దుమ్మెత్తిపోసిన లేదా బాలేదు అని విమర్శించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన దాఖలాలు కూడా లేవు. బాగుంది అని టాక్ వస్తే చాలు మాస్ హీరో అంటూ ఎవరు లేకపోయినా మహానటి లాంటి వాటికి పట్టం కట్టారు ఛలో లాంటి చిన్న సినిమాను ఆదరించారు. వీటికి ఏ రివ్యూ తేడాగా రాలేదన్న సంగతి మర్చిపోకూడదు. ఆది - కోన ల కాంబోలోనే గతంలో వచ్చిన నిన్ను కోరి కి రాని పరిస్థితి నీవెవరో కు మాత్రమే ఎందుకు వచ్చింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో.