Begin typing your search above and press return to search.

మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న బేబమ్మ.. ట్రిపుల్ రోల్‌ లో వర్సటైల్ హీరో..!

By:  Tupaki Desk   |   11 Oct 2022 11:19 AM GMT
మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న బేబమ్మ.. ట్రిపుల్ రోల్‌ లో వర్సటైల్ హీరో..!
X
మలయాళ వర్సటైల్ హీరో టొవినో థామ‌స్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 'మిన్నల్ మురళి' మూవీతో మరింత చేరువైన విలక్షణ నటుడు.. చివరగా 'తల్లుమాల' సినిమాతో అలరించాడు. అయితే ఇప్పుడు తాజాగా ''అజయంతే రందం మోషణం'' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు.

''అజయన్తే రందం మోషణమ్'' సినిమాతో టొవినో థామస్ తన కెరీర్‌ లోనే తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయనున్నాడు. మూడు యుగాల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మణియన్ - అజయన్ మరియు కుంజికేలు వంటి మూడు పాత్రల్లో టోవినో కనిపించనున్నాడు.

ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి - ఐశ్వర్య రాజేష్ మరియు సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన సౌత్ సెన్సేషన్ కృతికి.. ఇది మొదటి మలయాళ చిత్రం కావడం విశేషం. మరి మాలీవుడ్ లో అమ్మడు ఎలా రాణిస్తుందో చూడాలి.

'అజయంతే రందం మోషణం' చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. సుజిత్ నంబియార్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈరోజు మంగళవారం ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. టొవినో తో పాటుగా కృతి శెట్టి కూడా ఈ వేడుకకు హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

'అజయంతే రాండం మోషణం' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రధాన భారతీయ భాషల్లో రూపొందించనున్నారు. అంతేకాదు ఈ సినిమాని 3డీ ఫార్మాట్ లోనూ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యూజీఎం ప్రొడక్షన్స్‌ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేజిక్ ఫ్రేమ్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.

కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్‌ కు ఈ స్క్రిప్ట్ లో ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నందున టోవినో ఇటీవల కలరిపై ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇందులో బాసిల్ జోసెఫ్ - కిషోర్ - హరీష్ ఉత్తమన్ - హరీష్ పేరడి - జగదీష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తమిళ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ దీపు నైనాన్ థామస్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. గోకుల్ దాస్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. షమీర్ మహ్మద్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ''అజయంతే రాండం మోషణం'' సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.