Begin typing your search above and press return to search.

సినిమా రిలీజ్ కాకముందే రీమేక్

By:  Tupaki Desk   |   24 Sep 2020 2:30 AM GMT
సినిమా రిలీజ్ కాకముందే రీమేక్
X
రెండేళ్ల కిందట తమిళంలో మంచి విజయం సాధించడమే కాక.. క్లాసిక్ లాగా నిలిచిపోయిన ‘96’ సినిమాను దిల్ రాజు విడుదలకు ముందే చూసి ఫిదా అయిపోయి రీమేక్ హక్కులు తీసుకున్నాడు. ఆయన అంచనాలకు తగ్గని విధంగా ఆ సినిమా తమిళంలో చాలా బాగా ఆడింది. కానీ ఆయన అంచనా తెలుగులో మాత్రం ఫలించలేదు. ‘96’ రీమేక్ ‘జాను’ ఇక్కడ డిజాస్టర్ అయింది. ఐతే ఇప్పుడు మరో తమిళ సినిమా ఇంకా తమిళంలో విడుదల కాకముందే.. దాని రీమేక్ హక్కులు ఓ తెలుగు నిర్మాత సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమానే ‘శతురంగ వేట్టై-2’. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’కు మాతృక అయిన ‘శతురంగ వేట్టై’కి ఇది సీక్వెల్. కాకపోతే సీక్వెల్‌కు వచ్చేసరికి హీరో హీరోయిన్లు, దర్శకుడు మారిపోయారు.

‘ఖాకి’ దర్శకుడు వినోద్ తీసిన ‘శతురంగ వేట్టై’లో సినిమాటోగ్రాఫర్ నటరాజన్, ఇషారా జంటగా నటించారు. సీక్వెల్‌కు నిర్మల్ కుమార్ దర్శకుడిగా మారగా.. అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించారు. రెండేళ్ల కిందటే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అనివార్య కారణాలతో ఆలస్యమైంది. త్వరలోనే దీన్ని డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా మంచి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ‘క్రాక్’లో నటిస్తున్న మాస్ రాజా.. ఇంతకుముందు తనతో ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మతో ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. కెరీర్లో చాలా వరకు డిజాస్టర్లే తీసిన రమేష్.. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసుడు’ను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవితేజ కోసం మళ్లీ రీమేక్ ఫార్ములానే నమ్ముకున్న రమేష్.. ‘శతురంగ వేట్టై’ని తెలుగీకరిస్తున్నట్లు సమాచారం.