Begin typing your search above and press return to search.

క్రిటిక్ KRK పై స‌ల్మాన్ త‌ర్వాత మ‌నోజ్ భాజ్ పాయ్ క్రిమిన‌ల్ కేసు

By:  Tupaki Desk   |   26 Aug 2021 4:30 AM GMT
క్రిటిక్ KRK పై స‌ల్మాన్ త‌ర్వాత మ‌నోజ్ భాజ్ పాయ్ క్రిమిన‌ల్ కేసు
X
బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్. ఖాన్ ఎప్పుడూ సినిమాలపై తన వివాదాస్పద సమీక్షలతో విరుచుకుప‌డుతుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ కలెక్షన్ వివరాల‌ను చెబుతూ సూటిగా టీజ్ చేస్తూ విమ‌ర్శించ‌డం అత‌డి శైలి. అమీర్ ఖాన్- షారూక్ ఖాన్ - స‌ల్మాన్ ఖాన్ స‌హా ఎవ‌రినీ అత‌డు విడిచిపెట్ట‌లేదు. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల సినిమాల‌పై నెగెటివ్ రివ్యూలు రాసి ఆయ‌న వివాదాల్లో నిలిచారు. ఇండ‌స్ట్రీలో బ‌ల‌మైన శ‌త్రువుల‌తో అత‌డు నిరంత‌రం ఢీ అన‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది. ఇంత‌కుముందు ప్ర‌భాస్ సాహో పైనా నెగెటివ్ రివ్యూ రాసి తీవ్రంగా విమ‌ర్శించాడు అత‌డు. దానిపై డార్లింగ్ అభిమానులు సీరియ‌స్ అయ్యారు.

ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ `రాధే`పై రివ్యూ రాయ‌డ‌మే గాక స‌ల్మాన్ కి చెందిన బీయింగ్ హ్యూమ‌న్ స్వ‌చ్ఛంద సంస్థ‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసాడు. దీంతో సీరియస్ అయిన స‌ల్మాన్ కోర్టుకు లాగడంతో KRK పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు. కేసు న‌మోద‌య్యాక తాను అలాంటి త‌ప్పును చేయ‌బోన‌ని .. స‌మీక్ష‌లు ఆపేస్తాన‌ని సల్మాన్ టీమ్ తో ప్రాధేయ‌ప‌డ్డాడు ఒక ద‌శ‌లో. కానీ అటువైపు నుంచి రాజీ లేక‌పోవ‌డంతో తిరిగి త‌న పాత బాణీనే కొన‌సాగిస్తున్నాడు.

అయితే ఇలాంటి వివాదాల‌కు కేఆర్కే అస్స‌లు భ‌య‌ప‌డ‌డం లేదు. నిరంత‌రం త‌న‌దైన శైలిలో రివ్యూలు రాస్తూనే ఉన్నారు. ఎదురు దెబ్బ‌ల‌కు నిల‌బ‌డుతున్నారు. సినిమాలను సమీక్షించడం నటులను విమర్శించే శైలిని అత‌డు ఇప్ప‌టివ‌ర‌కూ మార్చుకోలేదు. ఇప్పుడు `ది ఫ్యామిలీ మ్యాన్` నటుడు మనోజ్ బాజ్ పేయి కెఆర్ కె పై పరువు నష్టం దావా వేయ‌డం క‌ల‌క‌లం రేపింది. 26 జూలై 2021 నాటి కెఆర్ కె ట్వీట్ ఆధారంగా ఐపిసి సెక్షన్ 500 (పరువు నష్టం) కింద కెఆర్ కె (46) పై మనోజ్ బాజ్‌పేయి క్రిమినల్ ఫిర్యాదును జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జెఎమ్ ఎఫ్ సి) కోర్టులో దాఖలు చేశారు.

కేఆర్కే ట్వీట్ అవమానకరంగా ఉందని తన అభిమానులు ఆరాధకులలో తన ప్రతిష్టను కేఆర్కే దిగజార్చాడని మ‌నోజ్ ఈ పిటీష‌న్ లో పేర్కొన్నాడు. మ‌నోజ్ కోర్టులో వ్యక్తిగత హాజరును కూడా సమర్పించి తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ విషయంలో క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేయాలని మనోజ్ కోర్టును కోరారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కేఆర్కే ఇక‌పై ప్ర‌తిదీ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. సమీక్షలు విమర్శల విష‌యంలో జాగ్రత్తప‌డాల్సి ఉంటుంది. న‌టీన‌టులు కానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కానీ త‌మ‌ను విమ‌ర్శిస్తే ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. కోర్టుల‌కు వెళ్లేందుకు ఇటీవ‌లి కాలంలో ఎవ‌రూ వెన‌కాడ‌డం లేదు. మునుముందు సౌత్ నుంచి వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు రానున్నాయి. రామ్ చ‌ర‌ణ్‌-తార‌క్ - రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ పైనా.. య‌ష్ - ప్ర‌శాంత్ నీల్ ల కేజీఎప్ పైనా అత‌డి దృష్టి ఉంది. అయితే నెగెటివ్ స‌మీక్ష‌లే కాకుండా వాస్త‌వాల్ని అత‌డ రాస్తే బావుంటుంద‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌ల సినిమాల‌పైనా బాలీవుడ్ పాపుల‌ర్ క్రిటిక్.. జ‌ర్న‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చి అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంటే అందుకు పూర్తి విరుద్ధంగా కేఆర్కే నెగెటివ్ రివ్యూల‌ను మాత్ర‌మే ఎంచుకోవ‌డం ప్ర‌తిసారీ చ‌ర్చ‌కు వ‌స్తుంటుంది.