Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ఎఫ్-3’

By:  Tupaki Desk   |   27 May 2022 7:36 AM GMT
మూవీ రివ్యూ : ‘ఎఫ్-3’
X
చిత్రం : ‘ఎఫ్-3’

నటీనటులు: వెంకటేష్-వరుణ్ తేజ్-తమన్నా-మెహ్రీన్-సోనాలి చౌహాన్-సునీల్-రాజేంద్ర ప్రసాద్-మురళీ శర్మ-ఆలీ-రఘుబాబు- వెన్నెల కిషోర్-సంపత్-సత్య-ప్రగతి-అన్నపూర్ణ-వై.విజయ-ప్రదీప్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి

మూడేళ్ల కిందట సంక్రాంతికి విడుదలై ఘనవిజయాన్నందుకున్న చిత్రం.. ఎఫ్-2. దీనికి కొనసాగింపుగా అదే టీంతో ‘ఎఫ్-3’ తీశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

వెంకీ (వెంకటేష్).. వరుణ్ (వరుణ్ తేజ్) ఆర్థికంగా బాగా దెబ్బ తిని.. ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించి జీవితంలో సెటిలవ్వాలని చూస్తున్న వ్యక్తులు. కానీ వాళ్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా డబ్బులు సంపాదించే మార్గం మాత్రం కనిపించదు. ఇలాంటి తరుణంలో హనీ (మెహ్రీన్)ను చూసి డబ్బున్న అమ్మాయిగా పొరబడి.. ఆమెను పెళ్లాడి తన ఆస్తినంతా దక్కించుకోవడం కోసం వెంకీతో కలిసి ప్రణాళిక రచిస్తాడు వరుణ్. అందుకోసం అప్పులు చేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాక హనీ నిజ స్వరూపం బయటపడుతుంది. వరుణ్ తనకిచ్చిన డబ్బులన్నీ ఆమె కుటుంబం పోగొట్టేయగా.. అప్పుల భారం వెంకీ-వరుణ్ మీద పడుతుంది. ఈ పరిస్థితుల్లో డబ్బుల కోసం వాళ్లేం చేశారు.. దాని వల్ల తలెత్తిన ఇబ్బందులేంటి.. వీటి నుంచి వాళ్లు చివరికి ఎలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక పెద్దాయన చిన్నపుడు ఇంటి నుంచి పారిపోయిన తన కొడుకు కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ కొడుకు వస్తే ఆస్తినంతా అప్పగించేస్తానని టీవీలో ప్రకటన ఇస్తాడు. అంతే.. మన ఇద్దరు హీరోలతో పాటు ఇంకో ఇద్దరు ముఖ్య పాత్రధారులు ఆయన కొడుకు చిన్నతనంలో చేతి మీద వేసుకున్న పచ్చబొట్టు మాదిరే తమ చేతుల మీదా టాటూలు వేసుకుని దిగిపోతారు. ఇది వినగానే 30 ఏళ్ల కిందటి ‘చంటబ్బాయ్’ కళ్ల ముందు కదలాడుతుంది. ఆ వేల కోట్లున్న పెద్ద మనిషి వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి.. చివరగా నష్టాల్లో ఉన్న తన బొమ్మల కంపెనీని టాప్ లోకి తీసుకొచ్చే వాళ్లకే తన ఆస్తంతా అంటాడు. దీంతో ఇద్దరు హీరోలు.. మిగతా గ్యాంగ్ అంతా కలిసి చకచకా తమ బుర్రలకు పదును పెట్టేసి.. క్రేజీ ఐడియాలతో కొత్త బొమ్మలు తయారు చేసి ఆ కంపెనీని టాప్ లోకి తీసుకొచ్చేస్తారు. ఈ సీన్ వింటుంటే.. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా తలపుల్లోకి రాకుండా ఉండదు. హీరోయిన్ బాగా డబ్బున్న అమ్మాయనుకుని ఆమె కోసం లక్షలు ఖర్చు పెడితే.. చివరికి ఆమె టిఫిన్ సెంటర్ నడిపే ఫ్యామిలీలో ఒక మెంబర్ అని తెలిసి హీరో కంగు తింటాడు. ఈ సీన్ చూసి ఒకటీ రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి.

ఎఫ్-3’ సినిమా చూడబోయే ముందు కొత్తదనం కాకరకాయ లాంటి మాటలు తీసి పక్కన పెట్టేయాలి అనడానికి పై సన్నివేశాలు ఇండికేటర్లన్నమాట. అలాగే లాజిక్ అనే పదాన్ని కూడా థియేటర్ ఎంట్రీ దగ్గర డస్ట్ బిన్ లో వేసేసి లోపలికి అడుగు పెట్టాలి. అప్పుడే ఇందులోని ఓవర్ ద టాప్ కామెడీని ఎంజాయ్ చేయగలం. కథలో పెద్దగా విషయం లేకపోయినా.. కొత్తదనం రవ్వంతా కనిపించకపోయినా.. సన్నివేశాలన్నీ లాజిక్ కు అందకుండా సాగినా.. ప్రేక్షకులకు అవసరమైన ఫన్ డోస్ ఇవ్వడంలో ‘ఎఫ్-3’ నిరాశ పరచలేదు. మరీ ‘ఎఫ్-2’ రేంజ్ వినోదం లేదు కానీ.. కామెడీని ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడినీ ఎంతో కొంత సంతృప్తి పరిచి.. వారిని ఎంగేజ్ చేయడంలో ‘ఎఫ్-3’ విఫలం కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే టైంపాస్ కామెడీకి ఇందులో ఢోకా లేదు.
టాలీవుడ్లో సీక్వెల్స్.. ఫ్రాంఛైజీ సినిమాలు తెరకెక్కడమే తక్కువ. అవి విజయవంతమైన దాఖలాలు ఇంకా అరుదు. అయినా అనిల్ రావిపూడి ‘ఎఫ్-3’ సినిమాతో సాహసానికి సిద్ధపడ్డాడు. ‘ఎఫ్-2’ లాంటి సూపర్ హిట్ కామెడీ మూవీకి కొనసాగింపుగా రావడం దీనికి ప్లస్ అలాగే మైనస్ కూడా. తొలి భాగంలో పాత్రలకు బాగా అలవాటు పడి ఉండడం.. అవి మరింత నవ్విస్తాయని ప్రేక్షకులు కళ్లు మూసుకుని థియేటర్లకు వచ్చేయడం అడ్వాంటేజ్ అయితే.. వారి అంచనాలను అందుకోవడం.. కొత్తగా ఏదో చేసి నవ్వించడం అనేది పెద్ద సవాలు. ఈ విషయంలో అనిల్ రావిపూడి పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పలేం. అదే సమయంలో అతను నిరాశపరచనూ లేదు. ఈ జబర్దస్త్ రోజుల్లో ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు నవ్వించడమే ధ్యేయంగా సినిమా తీసి మెప్పించడం అంటే అంత తేలిక కాదు. అందుకోసం ఒకప్పట్లా పంచులు.. ప్రాసలను నమ్ముకున్నా.. సటిల్ గా సన్నివేశఆలను నడిపించాలని చూసినా జనాలకు ఆనట్లేదు. అందుకే అనిల్ తన మార్కు ‘ఓవర్ ద టాప్’ కామెడీని ఇంకా టాప్ కు తీసుకెళ్లిపోయాడు. పాత్రలతో విపరీతమైన హడావుడి చేసి.. స్క్రీన్ ను గోల గోలగా మార్చేసి కామెడీ పండించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు భలేగా పేలితే.. కొన్నిఅతిగా అనిపించి విసిగించాయి. ఐతే పేలిన సన్నివేశాలు చాలా వరకు టికెట్ డబ్బులకు న్యాయం చేసేయడం వల్ల ప్రేక్షకులు నిరాశ అయితే ఉండదు.

ఎఫ్-3 చూసే ముందు కథ-పాత్రల విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ‘ఎఫ్-2’లోని ప్రధాన పాత్రలన్నీ ఇందులో ఉంటాయి కానీ.. అందులో కథకు దీనికి అసలు సంబంధం లేదు. తొలి భాగంలో భార్యాభర్తలు.. ప్రేమికుల్లా చూపించిన ప్రధాన పాత్రలు ఇక్కడ మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెడతాయి. వారి నేపథ్యాలు మారిపోయాయి. ఒకరితో ఒకరికి రిలేషన్ లేనట్లు మళ్లీ కొత్తగా ఈ పాత్రలను చూపించారు. ఇక్కడ అందరి గొడవా డబ్బే. ఎవరికి వాళ్లు సమస్యల్లో చిక్కుకుని డబ్బు కోసం ఏం చేయడానికైనా తెగించే స్థితిలో ఉంటారు. ఈ పరిస్థితుల చుట్టూ కామెడీ పండించడానికి ప్రయత్నించాడు అనిల్. ఇందులో ప్రధాన ఆకర్షణ వెంకీ-వరుణ్ పాత్రలే. ఒకరిని రేచీకటి బాధితుడిగా.. ఇంకొకరిని నత్తితో ఇబ్బంది పడే కుర్రాడిగా చూపిస్తూ వేర్వేరుగా మేనరిజమ్స్ పెట్టి వాటి చుట్టూ ప్రథమార్ధంలో కామెడీ అదరగొట్టాడు అనిల్. ముఖ్యంగా రేచీకటి ఉన్నవాడిగా వెంకీ కామెడీ సినిమాకే మేజర్ హైలైట్. తనకు రేచీకటి లేదని కవర్ చేస్తూ వెంకీ పండించిన కామెడీ చూసి పడీ పడీ నవ్వుకుంటారు ప్రేక్షకులు. వీలున్నపుడల్లా ఆ కామెడీని వాడుకుంటూ ఆ పాత్రను ప్రేక్షకులకు చేరువ చేశాడు అనిల్. వరుణ్ నత్తి కామెడీ కూడా బాగానే పండింది. ఇక డబ్బున్న అమ్మాయిగా మెహ్రీన్ డ్రామా.. ఆమెను పడేయడానికి వెంకీతో కలిసి వరుణ్ ఆడే నాటకం.. చివరికి నిజం తెలిసి ఇద్దరూ షాకయ్యే తీరు.. ఈ సన్నివేశాల్లో కొత్తదనం ఏమీ లేకున్నా.. కామెడీ అయితే బాగా వర్కవుట్ అయింది. దీని వల్ల ప్రథమార్ధం వేగంగా నడిచిపోతుంది.

ఐతే ముందే అన్నట్లు ‘చంటబ్బాయి’ సినిమాను గుర్తుకు తెచ్చే ‘తప్పిపోయిన అబ్బాయి’ ట్రాక్ చుట్టూ నడిచే ద్వితీయార్ధం మాత్రం అంత ఎంగేజింగ్ గా సాగలేదు. కథ.. సన్నివేశాలు మరీ మూసగా అనిపించడం.. కామెడీ మరీ ఓవర్ ద టాప్ కు వెళ్లిపోవడంతో ఒక దశ దాటాక ప్రేక్షకులకు విసుగు తప్పదు. అక్కడక్కడా కొన్ని నవ్వులు పండినా.. సన్నివేశాలు ఏమంత ఎంగేజ్ చేయవు. ఐతే ప్రి క్లైమాక్సులో టాలీవుడ్ టాప్ హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ చేసిన పేరడీ కామెడీతో మళ్లీ ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తుంది. దీంతో పాటుగా తెలుగు సినిమాలపై సెటైర్లు వేస్తూ సాగే క్లైమాక్స్ కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. నారప్ప.. వకీల్ సాబ్ ట్రాక్ లను భలేగా వాడుకున్నాడు అనిల్. చివరి అరగంటలో కామెడీ వర్కవుట్ కావడంతో ఓవరాల్ గా ‘ఎఫ్-3’ ఓకే అనిపిస్తుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా.. కొత్తదనం ఆశించకుండా.. లాజిక్కులు పట్టించుకోకుండా చూస్తే ‘ఎఫ్-3’ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లి నవ్వుకోవడానికి తగ్గ ఫన్ డోస్ ఇందులో ఉంది.

నటీనటులు:

‘ఎఫ్-2’లో మాదిరే ‘ఎఫ్-3’లో కూడా షో స్టీలర్ వెంకటేషే. వినోదం పండించడంలో తనకు తిరుగులేదని వెంకీ మరోసార ిచాటి చెప్పాడు. కామెడీ విషయానికి వస్తే ఇమేజ్ సంకెళ్లన్నీ పక్కన పెట్టి చెలరేగిపోయే వెంకీ.. మరోసారి అదే శైలిలో అదరగొట్టాడు. రేచీకటి పాత్ర అంటే మామూలుగా కమెడియన్లే చేస్తారు. అలాంటిది వెంకీ ఏ భేషజం లేకుండా ఆ పాత్ర చేశాడు. అదే సమయంలో తన తర్వాత వచ్చిన యువ కథానాయకులను అనుకరిస్తూ నవ్వించడం కూడా ఆయనకే చెల్లింది. తనకు రేచీకటి లేదని కవర్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాల్లో వెంకీ కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. మిగతా సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. నత్తి ఉన్న కుర్రాడిగా వరుణ్ తేజ్ సైతం బాగానే చేశాడు. నత్తిని కవర్ చేసే సన్నివేశాల్లో అతను కూడా బాగా నవ్వించాడు. అతడి మేనరిజమ్స్ కూడా ఆకట్టుకుంటాయి. కానీ ద్వితీయార్ధంలో పాత్ర వీక్ అయిపోవడంతో అతను కూడా కొంచెం తగ్గాడు. తమన్నా.. మెహ్రీన్ పాత్రలు ‘ఎఫ్-2’ స్థాయిలో లేవు. వీళ్లిద్దరూ అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయారు. మెహ్రీన్ అయినా పర్వాలేదు కానీ.. తమన్నా పాత్ర మరీ నామమాత్రంగా అనిపిస్తుంది. మెహ్రీన్ పాత్రకు ప్రథమార్ధంలో బాగానే అనిపించినా.. లుక్స్ తేడా కొట్టడం మైనస్. మరీ బక్కచిక్కిన ఆమె వరుణ్ పక్కన అస్సలు సెట్ కాలేదు. సునీల్.. రఘుబాబు.. వెన్నెల కిషోర్.. రాజేంద్ర ప్రసాద్.. ఆలీ.. సహాయ పాత్రల్లో తమ పరిధి మేరకు బాగానే నవ్వించారు. మురళీ శర్మ.. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సూపర్ అనలేం. అలాగని తీసిపడేసేలా కూడా లేదు. పాటలు పర్వాలేదనిపిస్తాయి కానీ.. వినసొంపుగా అయితే లేవు. లైఫ్ అంటే.. ఊ ఆ.. పాటలు స్క్రీన్ మీద ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కొత్తగా అనిపించకపోయినా.. బాగానే సాగిపోతుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా సాగాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకు అలవాటైన రీతిలోనే రాత.. తీతతో వినోదం పండించే ప్రయత్నం చేశాడు. ఎప్పట్లాగే అతను కథ గురించేమీ తల బద్దలుకొట్టేసుకోలేదు. కొత్తగా ఏదో చేసేయడానికి ప్రయత్నించలేదు. చాలా కామెడీ సినిమాలను అటు ఇటు తిప్పి.. స్క్రిప్టు రెడీ చేసుకుని.. ఓవర్ ద టాప్ స్టయిల్లో సన్నివేశాలను నడిపిస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా ‘ఎఫ్-2’ కొనసాగింపు చిత్రం నుంచి ఆశించిన స్థాయిలో కామెడీ డోస్ లేకపోయినా.. అనిల్ ఓ మోస్తరుగా అయితే నవ్వించి ప్రేక్షకులను సంతృప్తి పరచగలిగాడు.

చివరగా: ఎఫ్-3.. కాలక్షేపం కామెడీ

రేటింగ్ - 2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater