Begin typing your search above and press return to search.

పుష్ప వెంటే దూసుకొస్తున్న‌ సింగ‌రాయ్

By:  Tupaki Desk   |   17 Dec 2021 10:30 AM GMT
పుష్ప వెంటే దూసుకొస్తున్న‌ సింగ‌రాయ్
X
క‌రోనా మ‌హ‌మ్మారీని స‌వాల్ చేస్తూ టాలీవుడ్ లో వ‌రుసగా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. అఖండ గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత పుష్ప గ్రాండ్ రిలీజ్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌లోనే శ్యామ్ సింగ‌రాయ్ దూసుకొస్తున్నాడు. డిసెంబ‌ర్ 24న క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రం అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అంత‌కుముందే శిల్ప‌క‌ళావేదిక‌లో 18డిసెంబ‌ర్ సాయంత్రం 6 నుంచి ప్రీరిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

థియేటర్లలోకి రాకను జరుపుకోవడానికి శ్యామ్ హై రైడింగ్ చేస్తున్నాడు.. #శ్యామ్ సింగ‌రాయ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు శిల్పకళా వేదికలో మ‌రో లెవ‌ల్లో సాగ‌నుంది! అంటూ టీమ్ వెల్లడించింది. 6 PM నుండి నేచురల్ స్టార్ హంగామా షురూ అయిన‌ట్టే అంటూ డ‌మ‌రుకం మోగించింది. ఈ సీజ‌న్ సింగ‌రాయ్ దే అంటూ గ్రాండ్ గా ప్ర‌క‌టించుకున్న నాని ఎలాంటి విజ‌యం అందుకోనున్నాడో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది. నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు అంతే పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇందులో సాయి ప‌ల్ల‌వి దేవ‌దాసీగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ ఆద్యంతం సింగ‌రాయ్ వ‌ర్సెస్ దేవ‌దాసీ రొమాంటిక్ ఎపిసోడ్స్ హైలైట్ గా క‌నిపించాయి. ఇక కృతి శెట్టితో నాని లిప్ లాక్ లు మ‌రో ఎత్తు. సుదీర్ఘ చుంబ‌నాల‌తో నానీ -కృతి జంట చెల‌రేగిపోవ‌డం ఖాయ‌మ‌ని యూత్ ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. తెలుగు -త‌మిళం లో సింగ‌రాయ్ హంగామా కొన‌సాగ‌నుంది.

సింగ‌రాయ్ హంగామాతో ఇయ‌ర్ ఎండ్ అదిరిపోతుంద‌నే అంచ‌నాలేర్ప‌డ్డాయి. 31 మిడ్ నైట్ సెల‌బ్రేష‌న్ కి ముందే వ‌రుస‌గా క్రేజీ చిత్రాల హంగామాతో టాలీవుడ్ లో హంగామా నెల‌కొంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15లోపు మూడు పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతుండ‌డంతో ఈ సంద‌డి మ‌రో లెవ‌ల్ కి చేర‌నుంది. వ‌రుస‌గా భారీ చిత్రాల హ‌డావుడితో ఒమిక్రాన్ సైతం భ‌య‌ప‌డుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఆస‌క్తిక‌రంగా టాలీవుడ్ లో వ‌ర‌స వంద కోట్ల క్ల‌బ్ ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పుష్ప పూర్తి రిజ‌ల్ట్ వీకెండ్ నాటికి తెలిసిపోతుంది. ఆ త‌ర్వాత అంద‌రి చూపు సింగ‌రాయ్ పైకి మ‌ళ్లుతుంది. జ‌స్ట్ వెయిట్.. అండ్ సీ..!