Begin typing your search above and press return to search.

విశ్వనటుడి సినీ ప్రస్థానానికి 62 ఏళ్ళు..!

By:  Tupaki Desk   |   12 Aug 2021 1:15 PM IST
విశ్వనటుడి సినీ ప్రస్థానానికి 62 ఏళ్ళు..!
X
విశ్వనటుడు కమల్ హాసన్ నేటితో 62 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ళ ప్రాయంలోనే బాలనటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన కమల్.. తొలి చిత్రం 'కళథూర్‌ కన్నమ్మ' 1960 ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ఫస్ట్ సినిమాతోనే రాష్ట్రపతి గోల్డ్‌ మెడల్‌ సాధించారు కమల్. ఈ క్రమంలో మరికొన్ని చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన కమల్.. ఆ తర్వాత మేకప్‌ ఆర్టిస్ట్‌ గా డ్యాన్స్‌ మాస్టర్‌ గా పని చేశాడు. 1974లో 'కన్యాకుమారి' అనే మలయాళ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు.

ఆరు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమకు సేవ చేస్తున్న కమల్ హాసన్.. ఇప్పటి వరకు ఆరు ప్రధాన భాషల్లో 231 చిత్రాల్లో నటించారు. 4 జాతీయ అవార్డులు - 2 ఫిలిం ఫేర్ అవార్డ్స్ - 17 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోకనాయకుడి ఖాతాలో ఉన్నాయి. భాషా బేధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్న కమల్.. తన విలక్షణమైన నటనతో దేశంవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ.. ఎన్నో ప్రయోగాలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

తెలుగులో 'అంతులేని కథ' 'ఇది కథ కాదు' 'మరో చరిత్ర' 'ఆకలి రాజ్యం' 'భామనే సత్య భామనే' 'పుష్పక విమానం' 'ఇంద్రుడు చంద్రుడు' 'స్వాతి ముత్యం' 'సాగర సంగమం' 'శుభ సంకల్పం' 'భారతీయుడు' 'దశావతారం' 'విశ్వరూపం'.. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు కమల్. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసే ఆయన.. సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ మీద పట్టుసాధించారు. కమల్ నటుడిగానే రచయితగా సింగర్ గా నిర్మాతగా దర్శకుడిగా సినిమా కోసం అనేక పాత్రలు పోషించారు.

కమల్ హసన్ సినీ ఇండస్ట్రీలో 62 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. #62YearsOfKamalism హ్యాష్ ట్యాగ్ తో సినీ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. విశ్వనటుడు ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ''విక్రమ్'' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమల్ హాసన్ కు సంబంధించిన సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు. 'సింహం ఎప్పుడూ సింహమే' అంటూ పేర్కొన్న ఈ పోస్టర్ లో కమల్ హాసన్ భుజంపై రక్తంతో తడిసిన కత్తిని పెట్టుకొని కనిపిస్తున్నాడు.