Begin typing your search above and press return to search.

#క్లాసిక్ మెమ‌రీ..40ఏళ్ల ఏఎన్నార్ `సుపుత్రుడు`

By:  Tupaki Desk   |   29 April 2021 5:00 PM IST
#క్లాసిక్ మెమ‌రీ..40ఏళ్ల ఏఎన్నార్ `సుపుత్రుడు`
X
బంధాలు అనుబంధాలు నాటి క్లాసిక్ సినిమాల్లో క‌నిపించేవి. అన్నాచెల్లెళ్ల.. అన్నాత‌మ్ముళ్ల అనుబంధాలు.. త‌ల్లి కొడుకు సెంటిమెంట్ ఇవ‌న్నీ కాల‌గ‌మ‌నంలో క‌రిగిపోతుంటే విలువ‌ల‌కు నీళ్లివ్వ‌ని క్లాసిక్ డేస్ లో అలాంటి చిత్రాలెన్నో వ‌చ్చాయి.

న‌ట‌శిఖ‌రం ఏఎన్నార్ న‌టించిన సుపుత్రుడు ఈ కేట‌గిరీనే. ఇందులోనూ విల‌న్ ఉంటాడు. కానీ మ‌నుషుల మ‌ధ్య‌ ఆప్యాయతానురాగాలు మ‌నిషి ప‌ట్ల క‌నీస విజ్ఞ‌త బాధ్య‌త అన్నీ క‌నిపిస్తాయి. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన సుపుత్రుడు చిత్రాన్ని మాధవీ కంబైన్స్ పతాకంపై జె.సుబ్బారావు- జి.రాజేంద్రప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. 1971 ఏప్రిల్ 29న విడుదలైంది. కె.వి.మ‌హ‌దేవ‌న్ సంగీతం అ సినిమాని మ‌రో పెద్ద ప్లస్.

క‌థానాయ‌కుడి త‌ల్లి ఒక‌రిని ప్రేమించి మోస‌పోతుంది. అలా ఓ బిడ్డ‌కు త‌ల్లి అయ్యాక చావే శ‌ర‌ణ్యం అనుకుని ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మైతే త‌న‌ని కాపాడిన డాక్ట‌ర్ అన్న అయ్యి సాకుతాడు. అలా ఆ బిడ్డ‌ను గారాబంగానే పెంచుతాడు ఆ డాక్ట‌ర్. అయితే పెద్దింటి కుర్రాడిగా అత‌డు పాడైపోవ‌డం న‌చ్చ‌ని త‌ల్లి మంద‌లించాల‌ని చూస్తుంది. అయితే త‌మ‌ ఇంట్లో ప‌నిమ‌నిషి త‌న‌ని అవ‌మానించ‌డ‌మేమిటి అని ఎదురు తిరుగుతాడు. ఆ త‌ర్వాత ఆమే త‌న త‌ల్లి అని డాక్ట‌ర్ కం పెంప‌కం తండ్రి ద్వారా తెలుసుకున్న ఆ కుర్రాడు త‌న త‌ల్లిని మోసం చేసిన‌వాడికి బుద్ధి చెప్పి సుపుత్రుడు అనిపించుకుంటాడు.

రొటీన్ క‌థే అయినా నాటి గొప్ప న‌టీన‌టుల తో ఈ సినిమా జ‌న‌రంజ‌కంగానే సాగుతుంది. బుల్లితెర‌పైనా ద‌శాబ్ధాల పాటు అల‌రించింది ఈ చిత్రం. ఏయన్నార్- లక్ష్మి జంటగా నటించ‌గా హీరో తల్లిగా అంజలీదేవి ఆమెను మోసం చేసినవాడిగా జగ్గయ్య.. హీరో పెంపుడు తండ్రిగా గుమ్మడి నటించారు. రాజనాల- పద్మనాభం- మిక్కిలినేని- ధూళిపాల- విజయ్ చందర్- రావి కొండలరావు- సాక్షి రంగారావు త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు.

సీనారే - ఆత్రేయ‌- కొస‌రాజు లాంటి దిగ్గ‌జ ర‌చ‌యిత‌లు పాట‌లు రాయ‌గా గుహ‌నాథ‌న్ క‌థ ను... ముళ్ల‌పూడి స్క్రీన్ ప్లేను అందించారు. చిలకమ్మా పిలిచింది... గోరింకా పలికింది...., .. ఏమివ్వనూ నీకేమివ్వనూ...,..ఓహోహో వయ్యారీ...అయ్యిందయ్యో అయ్యింది అమ్మాయిగారి పని... అంటూ సాగే పాటలతో క్లాసిక్ ఆల్బ‌మ్ గా నిలిచింది.

1971లో రిలీజైన ద‌స‌రాబుల్లోడు ఏఎన్నార్ కెరీర్ లో ఎంత‌టి సంచ‌ల‌న‌మో తెలిసిందే. ఆ సినిమాతో పోలుస్తూ ఆ త‌ర్వాత చాలా సినిమాలను జ‌నం ఆద‌రించ‌లేదు. బ్లాక్ అండ్ వైట్ లో తెర‌కెక్కిన‌ సుపుత్రుడు కూడా ఫ్లాపైంది. సుపుత్రుడు రిలీజై 40 వ‌సంతాలు పూర్త‌యింది.