Begin typing your search above and press return to search.

మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ..!

By:  Tupaki Desk   |   8 April 2021 7:28 PM IST
మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ..!
X
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఏడాదిన్నర కాలంగా వణికిస్తోంది. వైరస్ కట్టడి కోసం గతేడాది కొన్ని నెలల పాటు మన దేశంలో లాక్ ‏డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీని కారణంగా అన్ని ఇండస్ట్రీలతో పాటుగా చిత్ర పరిశ్రమ బాగా నష్టపోయింది. సుమారు తొమ్మిది నెలల పాటు సినిమా షూటింగ్ ‏లు నిలిచిపోయి.. థియేటర్లు మూతపడిపోయాయి. అయితే లాక్ డౌన్ తర్వాత కోవిడ్ నిబంధనలతో నెమ్మదిగా సినిమా థియేటర్లు రీ ఓపెన్ అయ్యాయి. 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించబడ్డాయి. కరోనా తీవ్రత తగ్గడంతో దీనిని 100 శాతానికి పెంచారు. వచ్చే సంక్రాంతి వరకు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసి పెట్టుకున్నారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి బాగుంది అనుకున్న సమయంలో మూడు నెలలు తిరగ కాకుండానే మళ్ళీ కరోనా ఉదృతి పెరిగింది. మళ్ళీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతుండటం సినీ ఇండస్ట్రీని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో థియేటర్స్ మళ్ళీ మూత పడ్డాయి. బాలీవుడ్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అలానే కర్ణాటకలో 50 శాతం సీటింగ్ చెయ్యాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 100 శాతం నుంచి యాభై శాతానికి సీటింగ్ ఆక్యుపెన్సీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 10 నుంచి అక్కడ థియేటర్స్ లో 50 శాతం సీటింగ్ రూల్ అమలు కానుంది. ఇక టాలీవుడ్ లో కూడా ఆక్యుపెన్సీ తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా 'లవ్ స్టోరీ' సినిమాని కోవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కేసుల్లో పెరుగుదల చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మరోసారి 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.