Begin typing your search above and press return to search.

మెతుకు మీద పేరు రాసి ఉన్న‌ట్టే.. వేషం మీద‌ వేసేవాడి పేరు రాసి ఉంటుంది!

By:  Tupaki Desk   |   5 Sept 2021 9:00 AM IST
మెతుకు మీద పేరు రాసి ఉన్న‌ట్టే.. వేషం మీద‌ వేసేవాడి పేరు రాసి ఉంటుంది!
X
``మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉన్న‌ట్టే వేషం మీద కూడా వేసే వాడి పేరు ఉంటుంది!!`` ఇదీ ఇండ‌స్ట్రీలోని ఓ సినీకార్మికుడి సూక్తి. క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో స‌రిగా వేషాల్లేక ఉపాధి క‌రువై తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయారు చిన్నా చిత‌కా ఆర్టిస్టులు. ఏ ఆర్టిస్టును క‌దిపినా క‌ష్టాల క‌డ‌లి త‌న్నుకు వ‌స్తోంద‌ని `తుపాకి` ప‌రిశీల‌లో తేలింది.

ఓ సినీకార్మికుడిని ప్ర‌శ్నిస్తే ఆయ‌న నుంచి వ‌చ్చిన స‌మాధానం కరోనా కాలంలో ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితికి అద్దం ప‌ట్టింది. ఇంత‌కీ స‌ద‌రు న‌టుడు ఏమ‌న్నారు అంటే ..``నేను ఇండస్ట్రీకి వచ్చి 38 సంవ‌త్స‌రాలు అవుతోంది. ఇంతవరకు అయినా నేను ఎవ‌రో అందరికీ తెలియదు. మీరనుకోవచ్చు కొన్ని వందల సినిమాలు చేసి ఉంటానని .. కానీ అన్ని భాషలు అంటే తెలుగు -తమిళ్ -ఇంగ్లీష్ భాషలతో కలిపి ఒక డెబ్భై సినిమాలు కూడా ఉండవు. మరి ఇన్నేళ్లు ఇక్క‌డ నా కుటుంబ పోషణ ఎలా సాగింది? అన‌డిగితే .. నేను వేరే పనులు చేసుకొని సంపాదించు కున్నవే. అయినా సినిమా అన్నది ముఖ్యంగా నటీ నటులకు ఏ కొద్ది మంది అదృష్టవంతుల‌కో తప్పించి అందరూ సినిమాలు ద్వారా స్థిర పడలేరు. సినిమా ఇండస్ట్రీ మనలను బొట్టు పెట్టి పిలవదు. అయినా ఆస‌క్తి కొద్దీ అవసరానికి మించి మనం ఆఫీస్ ల‌ చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఒక మీడియం సినిమా 150 నుండి 200 మందికి అన్ని శాఖలు కలిపి పని ఇవ్వగలదు. సంవత్సరానికి వంద సినిమాలు కూడా తీయడం లేదు. అదృష్టం కొద్దీ టీవీ సీరియల్స్ మనకు కొద్దో గొప్ప పని ఇవ్వగలుగుతున్నాయి. ఈ క‌రోనా వల్ల సినిమాలు ఈ మధ్య త‌గ్గిపోయాయి. టీవీ సీరియల్స్ మొత్తం ఆగిపోయాయి. సినిమా థియేట‌ర్ కార్మికులు.. వాటి ఓనర్స్ పరిస్థితి కూడా ఆలోచించండి.

ఇప్పుడిప్పుడే సినిమాలు సీరియల్స్ మొదలు అయ్యాయి. మీలో ఉన్న నటనా సామర్థ్యాలను పెంచుకోండి. అవకాశాల కోసం ప్రయత్నించండి విరామం తీసు కోకుండ మీలో టాలెంట్ క్యారెక్ట‌ర్ కి తగిన శరీర సౌష్ఠవం ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయి. కాకపోతే వాళ్ళ దృష్టిలో పడాలి. దానికి ఒకటే మార్గం.. సినిమాలు చేస్తున్న ఆఫీస్ లకు వెళ్ళి కలవండి.. ఆడిషన్స్ ఇవ్వండి.. మీ దగ్గర సత్తా ఉంటే ఒకరు కాకపోతే మరొకరు అవకాశం ఇస్తారు. సినిమాని ఒక ప్యాషన్ తో చూడండి .అంతే గానీ బ్రతుకు తెరువు లాగ కాదు.. అందరూ చిరంజీవులు అనుష్క‌లు అయిపోవాలనే వస్తారు.. కానీ వారు చేసిన కృషి కూడా చెయ్యాలి కదా!! దానికితోడు అదృష్టం అన్నది ఒకటుంది కదా.. అదికూడా కలసి రావాలి.

ఒక్కటి గుర్తు పెట్టుకోండి గెలిచేవాడు వదలడు.. వదిలేసేవాడు ఎప్పటికీ గెలవడం అన్నది జరుగదు. అందరూ ఆఫీస్ అడ్రెస్ లు తెలుసుకో లేరు. కారణాలు ఏమయినా కానీ తెలిసిన వారు తెలియ‌జేస్తే వీళ్ళు కూడా ప్రయత్నం చేసుకుంటారు. అమ్మో అడ్రస్ చెబితే మన అవకాశాలు పోతాయేమో అని భావించ వద్దు. నా అనుభవంలో నాతో పాటు తీసుకెళ్లిన వారికి అవకాశాలు కొంత మందికి దొరికితే క్యారెక్ట‌ర్ కి సూట్ అయితే వాళ్ల వ‌ల్ల‌ నాకూ వేషాలు దొరికేవి. కొన్ని గర్వంగా చెప్పుకునే పెద్ద వేషాలు కూడా దక్కాయి. మనం అన్నం పెట్టలేకపోయినా అన్నం దొరికే చోటు చూపించినా పుణ్యమే కదా! మరొకటి గుర్తు పెట్టుకోండి ``మెతుకు మీద తినేవాడి పేరు వ్రాసి ఉన్నట్లే వేషం మీద కూడా వేసే వాడి పేరు ఉంటుంది`` నిరుత్సాహపడవద్దు ప్రయత్నం ఆపవద్దు. ఆల్ ది బెస్ట్.. అంటూ సుదీర్ఘ నోట్ ని రాసారు.

దీనికి ఆర్టిస్ట్ గ్రూప్ నుంచి స్పంద‌న‌లు బావున్నాయి. సుందరయ్య గారూ నమస్తే.. చాలా బాగా చెప్పారు ... మన దురదృష్టం ఏంటంటే ... సినిమా చేసిన వాళ్ళ అడ్రెస్ తెలిసినా చెప్ప‌రు... వాళ్ళు తమని ఎక్కడ మించిపోతారోనని భయం.. స్వార్ధం ప్రక్కన పెట్టి.. మనము ఒక్కరికి హెల్ప్ చేస్తే .. మనకు పది మంది హెల్ప్ చేస్తారనే భావన ఉన్నపుడే... ప్రతి ఒక్కరికి ఈ ఇండస్ట్రీ లో న్యాయం జరుగుతుంది. ఇది సత్యం.. అంటూ ఓలేటి జయరామ్ అనే న‌టుడు స్పందించారు. ఇండ‌స్ట్రీలో ద్వితీయ శ్రేణి ఆర్టిస్టులు ఎవ‌రిని క‌దిపినా ఇదే ప‌రిస్థితి. డ‌బ్బు ఇంత‌కుముందులా విచ్చ‌ల‌విడిగా సంపాదించే ప‌రిస్థితి అయితే ఇప్పుడు లేదు. మునుముందు కాలం మారాలి. క‌రోనా పూర్తిగా వైదొలిగింద‌న్న భ‌రోసా కావాలి. భార‌త‌దేశంలో 50శాతం వ్యాక్సినేష‌న్ అయినా పూర్త‌వ్వాలి. అప్పుడే కొంత‌యినా ఇండ‌స్ట్రీలు బాగ‌వుతాయేమో! తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం (టీఎంటీఏయు) సౌజ‌న్యంతో...!