Begin typing your search above and press return to search.

టాలీవుడ్: 2021 ఫస్టాఫ్ బాక్సాఫీస్ రిపోర్ట్..!

By:  Tupaki Desk   |   1 July 2021 7:00 AM IST
టాలీవుడ్: 2021 ఫస్టాఫ్ బాక్సాఫీస్ రిపోర్ట్..!
X
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎక్కువ సమయం సినిమా ఇండస్ట్రీ మూతబడి ఉంది. 2020 ప్రారంభంలో కొన్ని సినిమాలు.. ఏడాది చివర్లో మరికొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వచ్చాయి. 2021లో అంతా బాగానే ఉందని అనుకుంటుండగా.. ఈ సంవత్సరం కూడా కోవిడ్ ప్రభావం తప్పలేదు. మొదటి మూడు నెలలు సినీ కార్యకలాపాలు సజావుగానే జరిగినా.. ఏప్రిల్ నుంచి వైరస్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వచ్చి పడింది. దీంతో కొత్త కొత్త సినిమాలతో థియేటర్లన్నీ సందడిగా ఉండే సమ్మర్ సీజన్ మొత్తం వృధాగా పోయింది. ఈ నేపథ్యంలో 2021లో ఆరు నెలలు గడిచిపోయాయి కాబట్టి.. ఫస్టాఫ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాం!

జనవరి: 50 శాతం థియేటర్ ఆక్యుపెన్సీతో సినిమాలు విడుదల అయ్యాయి. అయినప్పటికీ కొన్ని చిత్రాలు బాగానే వసూలు చేశాయి. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన 'క్రాక్' సినిమా 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీకి నూతనోత్సాహం తెచ్చిపెట్టింది. ఇక సంక్రాంతి సీజన్ లో వచ్చిన రామ్ 'రెడ్' తో పాటుగా డబ్బింగ్ సినిమా 'మాస్టర్' - యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. అదే సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'.. అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' సినిమాలు నిరాశపరిచాయి.

ఫిబ్రవరి: ఫస్ట్ వీక్ లో వచ్చిన తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ 'జాంబీరెడ్డి' సినిమా లాభాల బాట పట్టి హిట్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక వాలెంటైన్స్ వీక్ లో వచ్చిన మెగా 'ఉప్పెన' సంచలన విజయం నమోదు చేసింది. దాదాపు 100 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిందని తెలుస్తోంది. ఆ తర్వాత అల్లరి నరేష్ 'నాంది' సినిమా సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ అనిపించుకుంది. ఇదే నెలలో వచ్చిన 'చెక్' 'కపఠధారి' 'పిట్టకథలు' వంటి సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

మార్చి: సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్'.. ఆర్కే నాయుడు 'షాదీ ముబారక్'.. రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' వంటి సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. వీటిలో సందీప్ కిషన్ సినిమా ఓ మోస్తరు వసూళ్ళు రాబట్టగా.. మిగతావి ప్లాప్ గా నిలిచాయి. శివరాత్రికి వచ్చిన శర్వానంద్ 'శ్రీకారం' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అదే రోజు వచ్చిన నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనిపించుకుంది. ఇక నితిన్ 'రంగ్ దే' యావరేజ్ గా ఫలితాన్ని రాబట్టింది. ఇదే నెలలో వచ్చిన 'గాలి సంపత్' 'చావు కబురు చల్లగా' 'మోసగాళ్ళు' 'తెల్లారితే గురువారం' 'అరణ్య' 'శశి' వంటి సినిమాలు నిరాశపరిచాయి.

ఏప్రిల్: ఈ నెలలో 14 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా ఒక్కటే మంచి ఫలితాన్ని అందుకుంది. భారీ అంచనాలతో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 90 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇక కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమా హిట్ టాక్ తెచ్చుకొని విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వసూళ్ళు మాత్రం రాబట్టలేకపోయింది. అప్పటికే కోవిడ్ వైరస్ ప్రభావం పడటంతో జనాలు పెద్దగా థియేటర్ల వైపు చూడలేదు. ఇదే నెలలో వచ్చిన 'సుల్తాన్' 'యువరత్న' వంటి డబ్బింగ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు.

మే - జూన్: ఈ రెండు నెలల్లో కోవిడ్ వైరస్ పైచేయి సాధించింది. సెకండ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ మూతబడి సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. మొత్తం మీద 2021 ప్రథమార్థంలో మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ మంచి ప్రదర్శన ఇచ్చిందనే చెప్పాలి. జూలై రెండో వారం నుంచి థియేటర్లను తెరుస్తారని ప్రచారం జరుగుతోంది కనుక.... ఈ ఏడాది ద్వితీయార్థంలో పెద్ద సినిమాలు రిలీజ్ అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ నమోదయ్యే అవకాశం ఉంది.