Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల్లో విజేత ఎవరంటే..

By:  Tupaki Desk   |   13 Jan 2016 11:30 AM GMT
సంక్రాంతి సినిమాల్లో విజేత ఎవరంటే..
X
ఇంకా విడుదల కాకుండానే సంక్రాంతి సినిమాల విజేత ఎవరన్నది ఎలా చెప్పేయగలం? ఒక్కో సినిమా మీద ఒక్కో రకమైన అంచనా ఉండొచ్చు కానీ.. ముందే ఫలానా సినిమా విజేతగా నిలుస్తుందని చెప్పేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు లెండి. ఐతే సినిమాల సంగతేమో కానీ.. సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుడు మాత్రం విజేతగా నిలవడం ఖాయం. ఎందుకంటే గత కొన్నేళ్లలో చూసిన సినిమా పండగలతో పోలిస్తే ఇది చాలా గొప్ప పండుగ.

తెలుగులో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రావడమే గగనమైపోయింది. తెలుగు సినిమాకు అతి పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి కూడా రెండు సినిమాలకు మించి రావట్లేదు కొన్నేళ్లుగా. దీని వల్ల పెద్ద సినిమాల మొనోపాలీ అనేది పెరిగిపోయింది. ఆ ఒకటి రెండు సినిమాలే ఎలా ఉన్నా భరించక తప్పని పరిస్థితి వస్తోంది. ప్రేక్షకుడికి ఛాయిస్ అన్నదే లేని పరిస్థితి వచ్చేసింది. పది రోజుల పండగ సెలవుల్లో ఒకటి రెండు సినిమాలే చూడాల్సి రావడం.. అందులోనూ నెగెటివ్ టాక్ వచ్చినా భరించాల్సి రావడం వల్ల గత కొన్నేళ్లలో ప్రేక్షకుడికి సంక్రాంతి కిక్కివ్వలేదు. కానీ ఈసారి ఒకటికి నాలుగు సినిమాలొస్తున్నాయి. జనాలకు ఛాయిస్ లు పెరిగాయి. సినిమా బాగోలేకున్నా చూడాల్సిన గత్యంతరం లేదు.

ఇక టాక్ తో సంబంధం లేకుండా పెద్ద సినిమాలు కలెక్షన్లు దండుకునే దుస్సంప్రదాయానికి కూడా ఈసారి గండి పడనుంది. పెద్ద సినిమాల్ని 1500 థియేటర్లకు అటు ఇటుగా రిలీజ్ చేసుకుని.. ఓపెనింగ్స్ కుమ్మేసుకుని మాది హిట్టు సినిమా అని విర్ర వీగే పరిస్థితి కూడా లేదు. అన్ని సినిమాలకూ పరిమిత సంఖ్యలోనే థియేటర్లు దొరికాయి. దీని వల్ల నిజంగా దమ్మున్న సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర నిలుస్తుంది. హిట్టు సినిమాకు లాంగ్ రన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఒకరకంగా పరిశ్రమ మంచికే. ఇక ముందు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్పలేం కానీ.. సంక్రాంతి వరకైతే ఇది ఆరోగ్యకరమైన పరిణామమే. విడుదల తర్వాత ఈ సినిమాల్లో విజేతగా నిలిచేదేదో కానీ.. ప్రస్తుతానికైతే విజేత ప్రేక్షకుడే.