Begin typing your search above and press return to search.

20ఏళ్ల‌కే ఇన్ని లీల‌లేల శ్రీ‌లీలా?

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:30 AM GMT
20ఏళ్ల‌కే ఇన్ని లీల‌లేల శ్రీ‌లీలా?
X
నేటి జ‌న‌రేష‌న్ క‌థానాయిక‌ల తెలివైన‌ ఎత్తుగ‌డ‌ల‌ను మెచ్చుకుని తీరాలి. అటు సీనియ‌ర్ హీరోల‌కు ప‌చ్చ జెండా ఊపేస్తూ ఇటు యువ‌హీరోల‌ను విడిచిపెట్ట‌డం లేదు. సీనియ‌ర్లు జూనియ‌ర్లు అనే విభేధం ఎక్క‌డా లేదు! అటు మాస్ అభిమానులు కావాలి. ఇటు క్లాస్ ఫ్యాన్స్ కావాలి. అలా అభిమానం పొందాలంటే.. సోష‌ల్ మీడియాల్లో సీనియ‌ర్ హీరోల‌తో ఫోటోలు ప్ర‌ద‌ర్శ‌న‌లు కావాలి. యంగ్ హీరోల‌తో పోస్ట‌ర్లు ప‌డాల‌ని భావిస్తున్నారు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ చేరువ‌వ్వాలంటే ఇదే స‌రైన త‌రుణోపాయంగా భావిస్తున్నారు.

ఇటీవ‌ల శ్రుతిహాస‌న్ అలాంటి మ్యాజిక్ చేయ‌గ‌లిగింది. ఇటు రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ లాంటి హీరోల స‌ర‌స‌న న‌టించిన శ్రుతిహాస‌న్ అటు చిరంజీవి - బాల‌కృష్ణ లాంటి సీనియ‌ర్ల స‌ర‌స‌న న‌టించేయ‌డం బిగ్ డిబేట్ గా మారింది. ఇప్పుడు అదే బాట‌లో యువ నాయిక‌ శ్రీలీల (20) ఇటు యువ‌హీరోలు అటు సీనియ‌ర్లు అంద‌రినీ బ్యాలెన్స్ చేసేస్తోంది.

ఇటీవలే సీనియ‌ర్ హీరో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ స‌ర‌స‌న‌ ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.... త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సీనియర్ హీరో మహేష్ బాబు స‌ర‌స‌న ఎస్.ఎస్.ఎం.బి 28 కి సంతకం చేసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఇంత‌కుముందే మరో సీనియర్ హీరో బాలకృష్ణ తో క‌లిసి శ్రీలీల న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అనీల్ రావిపూడి ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. అయితే బాలయ్య సరసన సినిమాకి సంతకం చేయాలని శ్రీలీల తీసుకున్న నిర్ణయం చాలా మందికి షాక్ నిచ్చింది.

తండ్రి లేదా తాత‌ వ‌య‌సున్న‌ హీరోల‌తో ఇది ఎలా పాజిబుల్? అంటూ కొన్ని గుస‌గుస‌లు ఫిలింన‌గ‌ర్ లో వినిపించాయి. అయితే నాటి త‌రంలో శ్రీ‌దేవి లా.. నేటి త‌రంలో శ్రుతిహాస‌న్ లా శ్రీ‌లీల తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంద‌ని అర్థం చేసుకోవాలి.

నేటిత‌రం బ్యూటీ సీనియర్ హీరోల స‌ర‌స‌న న‌టించ‌డం తెలివైన ఎత్తుగడ అని.. ఎ-లిస్ట‌ర్ హీరోల‌తో న‌టిస్తే మాస్ కు సులభంగా చేరువ‌య్యే ఛాన్సుంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక సీనియర్ హీరోల సినిమాలకు సైన్ చేసి స‌రిపెట్టుకోవ‌డం స‌రికాదు.. అందుకే శ్రీలీల వ‌రుస‌గా యూత్ స్టార్ నితిన్.. ఇస్మార్ట్ హీరో రామ్ .. ఎన‌ర్జిటిక్ స్టార్ వైష్ణవ్ తేజ్ లాంటి టాప్ ఆర్డ‌ర్ యువ‌ హీరోల స‌ర‌స‌నా న‌టించేస్తోంది. 2023-24 సీజ‌న్ ని పూర్తిగా శ్రీ‌లీల త‌న ఖాతాలో వేసేసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆళ్లు ఈళ్లు అనే తేడా లే.. అంద‌రినీ ఖాతాలో వేసేస్తోంది! 20ఏళ్ల‌కే ఇన్ని లీల‌లేల శ్రీ‌లీలా? అంటూ కుర్ర‌కారు తెగ ఇదైపోతున్నారు మ‌రి!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.