Begin typing your search above and press return to search.

చైనాలో 2 శాతం ఆక్యుపెన్సీ.. థియేట‌ర్లు తెరిస్తే న‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   8 Jun 2020 10:15 AM IST
చైనాలో 2 శాతం ఆక్యుపెన్సీ.. థియేట‌ర్లు తెరిస్తే న‌ష్ట‌మే!
X
వాస్త‌వ ప‌రిస్థితుల్ని విశ్లేషించ‌డం.. బిజినెస్ ని లాభ‌దాయ‌కంగా న‌డిపించ‌డం ఎగ్జిబిట‌ర్ కం స్టార్ ప్రొడ్యూస‌ర్ డి.సురేష్ బాబు ప్ర‌త్యేక‌త‌. అందుకే ద‌శాబ్ధాల పాటు ఆయ‌న ఎగ్జిబిటర్ గా.. నిర్మాత‌గా .. స్టూడియో ఓన‌ర్ గా విజ‌య‌వంత‌మైన కెరీర్ ని సాగిస్తున్నారు. ఆయ‌న ఒక మాట చెబితే అది బిజినెస్ క్లాస్ వ‌ర్గాల‌కే కాదు సామాన్యుల‌కు కూడా క్లారిటీ గా ఎక్కేస్తుంది. అదే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.

గ‌త కొంత‌కాలంగా ఎగ్జిబిష‌న్ రంగం భ‌విష్య‌త్ ఏమిటి? మ‌హ‌మ్మారీ వేళ కోలుకునేదెలా? అంటూ అంతా బెంగ‌గా ఉన్నారు. మూసేసిన థియేట‌ర్ల‌ను ఇప్ప‌ట్లో ఓపెన్ చేయ‌లేని ధైన్యం నెల‌కొన‌డంతో ఈ రంగంలోని దాదాపు 50 వేల మంది కార్మికులు రోడ్డున ప‌డ్డారు. ఇక థియేట‌ర్ య‌జ‌మానుల ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగానే మారింది. ఆగ‌స్టులో థియేట‌ర్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చినా కానీ జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారా రారా? అన్న సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదే విష‌యం పై ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో డి.సురేష్ బాబు చెప్పిన మాట ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. థియేట‌ర్లు ఇప్పుడే తెరిస్తే చాలా న‌ష్టాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సురేష్ బాబు తొలి నుంచి చెబుతున్నారు. ఇప్ప‌టికీ అదే మాట మీదున్నారు ఆయ‌న‌. మ‌రో మూడు నెల‌ల వ‌ర‌కూ థియేట‌ర్లు తెర‌వ‌క‌పోవ‌డ‌మే మేలు అని సూచించారు. థియేట‌ర్లు తెరిచేయాల‌ని అంతా ఉబ‌లాట ప‌డుతున్నారు. కానీ దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇప్ప‌టికే థియేట‌ర్లు తెరిచిన చైనా..దుబాయ్ లో కేవ‌లం 2 శాతం మాత్ర‌మే ఆక్యుపెన్సీ ద‌క్కింది. అంటే 98 శాతం సీట్లు ఖాళీగానే మిగిలి పోయాయ‌ని అలా అయితే తీవ్ర న‌ష్టాలు త‌ప్పవు అని తెలిపారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచినా మ‌ళ్లీ మూసేయాల్సి ఉంటుంది. మూడు నెల‌ల త‌ర్వాత తెరిస్తేనే బెట‌ర్! అని సురేష్ బాబు సూచించారు.

చైనాలో థియేట‌ర్లు మ‌ళ్లీ మూసేసారు. అందువ‌ల్ల మేం కూడా ఆతురుతలో లేము. వాస్తవానికి దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో ఉన్నాం. పైగా ఇక్క‌డ‌ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదు. థియేటర్ వ్యాపారం నెమ్మదిగా చాలా మందికి భారం పడుతోంది. మనం ఇప్పుడు మళ్ళీ థియేటర్లను తిరిగి తెరిస్తే.. ఎగ్జిబిషన్ పరిశ్రమ మనుగడ సాగించడం కష్టమవుతుంది`` అని ఆయ‌న‌ అన్నారు.

జ‌నం ఓటీటీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. నిర్మాత‌లు ఓటీటీలో సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆసక్తిగానే ఉన్నార‌ని ఆయ‌న అన‌డం కొస‌మెరుపు. ఓటీటీలో నిర్ధిష్ఠ‌మైన కంటెంట్ ఉన్న సినిమాల్ని చూసేందుకు జ‌నం ఆస‌క్తిగా ఉన్నార‌ని ఆయ‌న విశ్లేషించారు.

తాను నిర్మిస్తున్న సినిమాల‌పైనా డి.సురేష్ బాబు తెలిపారు. వెంకటేష్ హీరోగా `నారప్ప`ను నిర్మిస్తున్నాను. దీనికి 25 రోజుల షూట్ పెండింగ్ లో ఉంది. ప్రతి రోజు మాకు 100 మంది సిబ్బంది అవసరం అని కూడా తెలిపారు.