Begin typing your search above and press return to search.

రాజమౌళి కోసం రెండు కోట్లతో ఇల్లు

By:  Tupaki Desk   |   25 July 2018 6:00 AM GMT
రాజమౌళి కోసం రెండు కోట్లతో ఇల్లు
X
బాహుబలి కోసం ఐదేళ్లు తీసుకున్న దర్శకుడు రాజమౌళిని మొదట్లో అంతా ఆడిపోసుకున్నారు.. కానీ బాహుబలి సినిమాలు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకురావడంతో ఆ ఐదేళ్లు తక్కువ కాలమే అని వ్యాఖ్యానించారు. రాజమౌళి క్రియేటివ్ జీనియస్ - మిస్టర్ పర్ ఫెక్ట్ అని మెచ్చుకున్నారు. క్వాలిటీ కోసం ఎన్ని సంవత్సరాలు అయినా రాజీపడకుండా చేస్తాడు రాజమౌళి. అందుకే ఆయన సినిమాలు అంత క్వాలిటీగా ఉంటాయి. సినిమా మొదలు పెట్టాడంటే ఇల్లు వాకిలి గురించి పట్టించుకోడు.. బాహుబలి తీస్తున్న టైంలో ఆయన ఫ్యామిలతో కలిసి రామోజీ ఫిలింసిటీలోనే ఉండిపోయారు. తన సొంత పనివారిని కూడా అక్కడికే తెచ్చుకున్నారు..

రాజమౌళి సినిమా అంటే ఆయనొక్కడే కాదు.. మొత్తం కుటుంబ పరివారమంతా పనిచేస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్.. అందుకే.. సినిమాలు అంత పర్ ఫెక్ట్ గా వస్తాయి. తాజాగా రాజమౌళి అనౌన్స్ చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా పనుల్లో రాజమౌళి బిజీ అయిపోయారు. నవంబర్ నెలాఖరు లేదా.. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేస్తున్నారు. బ్రిటీష్ కాలాన్ని తలపించేలా సెట్ ను తీర్చిదిద్దుతున్నారట..

అయితే ఈ సెట్ తో పాటు రాజమౌళి కోసం ఓ భారీ మండువా - షెడ్ ను కూడా నిర్మాత డీవీవీ దానయ్య రెండు కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాడట.. ఈసారి ఈ మల్టీస్టారర్ మూవీ పూర్తయ్యే వరకూ రాజమౌళి ఈ ఇల్లు కం ఆఫీస్ లోనే ఫ్యామిలీతో కలిసి ఉంటాడట.. ఇంటికి వెళ్లి రావడం వల్ల టైం వేస్ట్ అని సినిమా షూటింగ్ కు ఆలస్యం కాకుండా ఉండేందుకే రాజమౌళి కోసం సకల సదుపాయాలతో ఇంటిని నిర్మిస్తున్నట్టు తెలిసింది. దానిపక్కనే డైరెక్షన్ యూనిట్ కోసం మరో షెడ్ - యాక్టర్ల రిహార్సల్స్ కోసం మరో షెడ్ ను కూడా నిర్మిస్తున్నారు.

బ్రిటీష్ కాలం నాటి కథతో రాంచరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా నిర్మిస్తున్నఈ సినిమాకు ప్రస్తుతానికి 300 కోట్లు అనుకుంటున్నారట.. నిర్మాత డీవీవీ దానయ్య ఒక్కడే ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం. ఇలా రాజమౌళికి మొత్తం సెటప్ చేసి సినిమాను పూర్తి చేయించేందుకు నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం విశేషం.