Begin typing your search above and press return to search.

‘మా’లో అనూహ్య పరిణామం.. నరేశ్ పై లేఖతో తిరుగుబాటు!

By:  Tupaki Desk   |   28 July 2021 4:17 AM GMT
‘మా’లో అనూహ్య పరిణామం.. నరేశ్ పై లేఖతో తిరుగుబాటు!
X
ఎంతైనా సినిమా వాళ్లు కదా? సినిమాటిక్ సీన్లు లేకపోతే సీన్ రక్తి కట్టదని ఫీల్ అవుతున్నారేమో కానీ.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పలు మలుపులు తిరుగుతోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) ఎన్నికల వ్యవహారం. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ఈ ఫిబ్రవరిలో ముగిసింది. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంది. అయితే.. కరోనా కారణంగా అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. సెకండ్ వేవ్ షాక్ నుంచి కోలుకున్న నేపథ్యంలో ‘మా’ ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా తెర వెనుక కసరత్తు జరుగుతున్న వేళ.. ప్రకాశ్ రాజ్ అనూహ్యంగా తెర మీదకు రావటం అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పిన.. మూడు రోజులకే తన ప్యానల్ సభ్యులంటూ మీడియాకు పరిచయం చేసిన తీరు సంచలనంగా మారింది.

ఎంత బ్యాక్ గ్రౌండ్ వర్కు చేసుకోకుంటే.. మూడు రోజుల స్వల్ప వ్యవధిలోనే మొత్తం టీంను సిద్ధం చేసుకున్న వైనం చూస్తే.. ‘మా’ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రకాశ్ రాజ్ గడిచిన కొన్ని నెలలుగా బ్యాక్ గ్రౌండ్ వర్కు చేసుకుంటూ వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ప్రకాశ్ రాజ్ ఎంట్రీని గుట్టుగా దాచిన నేపథ్యంలో.. ఆయన ఒక్కసారిగా తెరమీదకు రావటం పలువురికి మింగుడుపడలేదు. దీంతో.. నాన్ లోకల్ నినాదాన్ని తీసుకొచ్చినా అదేం పెద్దగా పని చేయలేదు. ఇదే సమయంలో.. పలువురు తాము పోటీ చేస్తామని చెప్పటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ గురువారం ‘మా’ కార్యవర్గ సమావేశాన్ని వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించిన వేళ.. మంగళవారం ఊహించని రీతిలో పరిణామాలు చోటు చేసుకోవటమేకాదు.. కొన్ని అంశాలు షాకింగ్ గా మారాయి. అందులో ముఖ్యమైనది.. ప్రస్తుత (గడువు పూర్తి అయిన) ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు ‘మా’ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రష్ణం రాజుకు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.

‘మా’ కార్యవర్గం ఈ ఫిబ్రవరి నాటితో దాని గడువు పూర్తి అయ్యిందని.. ప్రస్తుతం ఒక ఎన్నికైన కార్యవర్గం లేకుండా నేపథ్యంలో.. ప్రస్తుత కమిటీకి ఎలాంటి నైతిక హక్కులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న క్రష్ణం రాజును పగ్గాలు చేపట్టి.. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని లేఖ రాయటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ప్రస్తుత కార్యవర్గసభ్యులుగా ఉన్న వారిలో పదిహేను మంది ఈ తరహా లేఖ రాయటం.. ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నరేశ్ కు ఎలాంటి సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించాలన్నది ఆలోచనగా తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

అంటే.. నరేశ్ ను పక్కన పెట్టేసి.. క్రిష్ణం రాజును న్యాయ నిర్ణేయతగా పెట్టేయాలన్నట్లుగా రాసిన లేఖలు చూస్తే.. తాజా పరిణామాల లెక్క చేయమన్న విషయంతో పాటు.. ఇప్పటికే ఆలస్యమవుతున్న ‘మా’ ఎన్నికల్ని వెంటనే నిర్వహించేందుకు వీలుగా లెక్కల్ని సెట్ చేశారని చెప్పక తప్పదు. మరి.. దీనికి సీనియర్ నటుడు నరేశ్ ఎలా రియాక్టు అవుతారన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.