Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర‌లో 100శాతం ఆక్యుపెన్సీతో కొత్త జోష్‌

By:  Tupaki Desk   |   3 March 2022 5:30 AM GMT
మ‌హారాష్ట్ర‌లో 100శాతం ఆక్యుపెన్సీతో కొత్త జోష్‌
X
తెలుగు సినిమా కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా పుంత‌లో అలుపెర‌గ‌కుండా ప్ర‌యాణిస్తోంది. ఇక్క‌డ ఎవ‌రికీ ఇంత‌కుముందులా ఇరుకు ఆలోచ‌న‌ల్లేవ్. ప్రాంతీయ వాద‌న‌లు అస‌లే లేవు. ఇప్పుడు అంతా యూనివ‌ర్శ‌ల్ భావ‌న‌లే అంద‌రిలోనూ..! ఇప్పుడు కేవ‌లం అన్న మెట్రో న‌గ‌రాలు అనుకోవ‌డం లేదు... అన్ని రాష్ట్రాలు మ‌న‌వే.. అన్ని ప్రాంతాలు అన్ని భాష‌లు అన్ని సంస్కృతులు మ‌న‌వే అని ఆలోచిస్తున్నారు.

హిస్ట‌రీ మొత్తాన్ని త‌వ్వి తీస్తున్నారు. ప్రేమ‌క‌థ‌ల్లో కొత్త‌ద‌నాన్ని చేర్చి దేశ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. అమెరికా స‌హా విదేశీ మార్కెట్ ని టాలీవుడ్ అందిపుచ్చుకుంటోంది. బాహుబ‌లి త‌ర్వాత అసాధార‌ణ ప‌రిణామమిది. ఇక ముందు అర‌డ‌జ‌ను మంది తెలుగు స్టార్లు క‌న్ఫామ్ గా పాన్ ఇండియా స్టార్లుగా ఏల్తార‌న్న భ‌రోసా క‌నిపిస్తోంది.

ఇదిలా ఉండ‌గా అస‌లు పాన్ ఇండియా సినిమాల‌కు క‌రోనా రెయిన్ చెక్ పెట్టి ఏడిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్లుగా ఇదే స‌న్నివేశం నెల‌కొంది. మాయ‌దారి మ‌హమ్మారీ ఎందుకొచ్చిందో కానీ వ‌ద‌ల బొమ్మాళీ అంటోంది. అయితే ఇన్నాళ్లు క‌రోనా ఆగ‌డాలు సాగినా కానీ ఇక సాగ‌వు. భార‌త‌దేశంలో సంపూర్ణ వ్యాక్సినేష‌న్ పెద్ద‌గానే వ‌ర్క‌వుటైంది. కేసులు వ‌స్తున్నా చావుల్లేక‌పోవ‌డంతో అంద‌రూ ఇళ్ల బ‌య‌టే తిరుగుతున్నారు.

ఇప్ప‌టికే మాస్కులు తీసేశారు. దీంతో సినీప‌రిశ్ర‌మ‌కు ఊర‌ట‌నిచ్చేలా ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఇక పాన్ ఇండియా రిలీజ్ ల‌కు మ‌హ‌ర్ధ‌శ‌! ప‌ట్ట‌నుంద‌ని సంకేతం అందింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై సా ఇతర పదమూడు జిల్లాల్లోని థియేటర్లలో 100శాతం ఆక్యుపెన్సీని అనుమతించింది. భారతదేశంలో చలనచిత్ర వ్యాపారానికి సహకరించే అన్ని ప్రధాన రాష్ట్రాలు ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీతో పనిచేస్తే వ‌సూళ్లు ఆల్మోస్ట్ నాలుగు రెట్లు పెరుగుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న అన్ని పాన్ ఇండియా చిత్రాల‌కు క‌లిసి రానుంది.

తొలిగా ప్ర‌భాస్ - పూజా హెగ్డే జంట‌గా న‌టించిన రాధేశ్యామ్ పెద్ద స్థాయిలో లాభ‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత‌ RRRమూవీ అనంత‌రం KGF చాప్టర్2 స‌హా ఎన్నో చిత్రాల‌కు గొప్ప ప్రయోజనం చేకూర‌నుంది. త్వ‌ర‌లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న భీమ్లా నాయ‌క్ హిందీ వెర్ష‌న్ కి ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. తెలుగులో బంప‌ర్ హిట్ కొట్టిన నేప‌థ్యంలో అటు హిందీ బెల్ట్ లోనూ భీమ్లా కి చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కుతాయ‌ని ఆశిస్తున్నారు.

చాలా కాలంగా బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ధ‌లు కొట్టే సినిమాలేవీ రావ‌డం లేదు. మునుముందు రిలీజ‌వుతున్న వాటిలో పాన్ ఇండియా లెవ‌ల్లో అసాధార‌ణ వ‌సూళ్ల‌తో పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తాయేమో చూడాలి. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2ల‌పై అలాంటి అంచ‌నాలున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.