Begin typing your search above and press return to search.

AR రెహమాన్ ఫేవ‌రెట్ గాయ‌ని 10000 పాట‌లు

స్వర్ణలత దక్షిణ భారత చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ, హిందీ సంగీత ప్రియులలోను పాపుల‌రైంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:28 AM GMT
AR రెహమాన్ ఫేవ‌రెట్ గాయ‌ని 10000 పాట‌లు
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ చాలా చిన్న వయస్సులో అనంత‌మైన‌ కీర్తిని సంపాదించడంలో విజయం సాధించిన చాలా మంది తారలను చూసింది. కానీ వారిలో కొంద‌రు దురదృష్టవశాత్తు చిన్న వయస్సులోనే ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. దివ్య భారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ వంటి స్టార్లు చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యారు. కానీ చిన్న వ‌య‌సులోనే చనిపోయారు. అలాంటి మరో ధృవ‌తార గాయ‌ని స్వర్ణలత.. 37 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు ఆమె. స్వర్ణలత.. హిందీ, సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. 12 సెప్టెంబర్ 2010న మరణించారు. కానీ స్వ‌ర్ణ‌ల‌త త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ పాట‌లు పాడిన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. తన చిన్న కెరీర్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ సహా దాదాపు 10 భాషలలో 10000 పాటలు పాడారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ళ‌ప‌తి చిత్రంలో య‌మునా త‌టిలో .. పాట‌కు స్వ‌ర్ణ‌ల‌త గాత్రం మ‌హ‌దాద్భుతం. అద్భుత‌మైన మెలోడీని ఎంతో శ్రావ్యంగా పాడారు ఆమె. ఆ పాట ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్లో రింగుమంటుంది. వాసు చిత్రంలో `పాట‌కు ప్రాణం ప‌ల్ల‌వి అయితే..` పాట‌ను స్వ‌ర్ణ‌ల‌త ఆల‌పించారు. ప్రేమంటే ఇదేరా లో నైజాం బాబులుకు గొంతు క‌లిపారు ఆమె. ఒసేయ్ రాముల‌మ్మ టైటిల్ పాట‌లోను స్వ‌ర్ణ‌ల‌త గాత్రం వినిపించింది. ఇంకా ఎన్నో క్లాసిక్స్ త‌న నుంచి వ‌చ్చాయి.

స్వర్ణలత దక్షిణ భారత చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ, హిందీ సంగీత ప్రియులలోను పాపుల‌రైంది. `నీతిక్కు తందానై`లో కెజె యేసుదాస్‌తో కలిసి `చిన్నచిరు కిలియే` అనే పాపుల‌ర్ పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. స్వర్ణలత చాలా చిన్న వయస్సులోనే భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడంలో విజయం సాధించింది.

మేటి యువ‌గాయ‌ని తన ఫేవరెట్ సింగర్ అని ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. స్వర్ణలత 1973లో కేరళలో జన్మించారు. ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో మరణించారు. స్వర్ణలత తీవ్రమైన ఇడియోపతిక్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడ్డారు.

స్వర్ణలత కరుత్తమ్మ చిత్రంలోని `పోరాలే పొన్నుతాయి` పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. A. R. రెహమాన్ సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా ఆమె.