ఏఆర్ రెహమాన్ ను సింగపూర్ అధ్యక్షుడు ఎందుకు అభినందించాడు? ఆ కథేంటి?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు.
By: Tupaki Desk | 5 Jun 2025 6:19 PM ISTప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులను సంపాదించుకున్న రెహమాన్‌ను తాజాగా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రశంసించారు.
అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన మల్టీ-సెన్సరీ వర్చువల్ రియాలిటీ చిత్రం ‘లే మస్క్’ లో సింగపూర్‌కు చెందిన సంగీత కళాకారులతో కలిసి పనిచేసిన రెహమాన్ పనితీరుపై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ మే నెలలో సింగపూర్‌లో అధికారికంగా విడుదలైంది.
ఈ సందర్భంగా రెహమాన్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ‘‘భాష, దేశసీమలకతీతంగా సంగీతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం హర్షణీయమైన విషయం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘సింగపూర్ ప్రెసిడెంట్‌ను కలవడం గొప్ప గౌరవంగా అనిపించింది. సింగపూర్ ఆర్టిస్టులతో మళ్లీ పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’’ అని రెహమాన్ తెలిపారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు రెహమాన్‌ను అభినందిస్తున్నారు.
తెలుగు సినిమాలకు కూడా రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న మక్కువ మరింత పెరుగుతోంది. ఒక భారతీయ సంగీత దర్శకుడిగా ప్రపంచ వేదికపై మాధుర్యాన్ని పంచుతూ, సంగీతానికి సరిహద్దులే లేవని మరోసారి నిరూపించారు ఏఆర్ రెహమాన్.
