నిశ్శబ్ధం నుంచి సంగీతాన్ని పుట్టించే టెక్నిక్ చెప్పిన AR రెహమాన్
అయితే సంగీతాన్ని శూన్యం నుంచి వెతికే అతికొద్ది మంది సంగీత దర్శకులలో ఇళయరాజా తర్వాత ఏ.ఆర్.రెహమాన్ అత్యంత సుప్రసిద్ధులు.
By: Sivaji Kontham | 18 Feb 2026 12:00 AM ISTచాలా కొత్త సినిమాల పాటలు విన్నప్పుడు `ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్టుంది` అనిపిస్తుంద..! వినిపించిన ట్యూన్‌నే వినిపిస్తూ, ఒకటే దరువు మళ్లీ మళ్లీ వినిపిస్తూ, అభిరుచి లేని సంగీతంతో సంగీత ప్రియులను ఇర్రిటేట్ చేస్తున్న సంగీత సృజకులకు కొదవేమీ లేదు. చాలా మంది మూస ధోరణి సంగీత దర్శకులు చేసే పనిని ప్రజలు హర్షించడం లేదు. అయితే నేటితరంలో కొందరు సృజనాత్మక సంగీత దర్శకులు తమ క్రియేటివిటీ నుంచి ఆణిముత్యాలను అందిస్తున్న విషయాన్ని కూడా విస్మరించకూడదు.
అయితే సంగీతాన్ని శూన్యం నుంచి వెతికే అతికొద్ది మంది సంగీత దర్శకులలో ఇళయరాజా తర్వాత ఏ.ఆర్.రెహమాన్ అత్యంత సుప్రసిద్ధులు. ఆయన చాలా సార్లు తన ప్రసంగాల్లో చెప్పారు. తాను శూన్యం నుంచి సంగీత ధ్వనుల్ని వింటానని.. దాని నుంచి ఒక కొత్త పాట పుట్టుకొస్తుందని.. అంతేకాదు.. అర్థరాత్రి అంకమ్మ శివాలు తరహాలో నిదుర పోకుండా ఎదురు చూడటం కూడా ఇందులో భాగం. ఇది ఆయనతో కలిసి పని చేసే చాలా మంది గాయనీగాయకులకు నచ్చనిది అయినా రెహమాన్ అలాంటి ఒక ప్రయత్నం చేసారు.
తాజాగా మరోసారి ఏ.ఆర్ రెహమాన్ తీసుకున్న ఒక నిర్ణయం సంచలనంగా మారింది. ఆయన ప్రస్తుతం రామాయణం లాంటి ప్రతిష్ఠాత్మక వరల్డ్ క్లాస్ సినిమా కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సాంకేతిక నిపుణుల పనితనం చాలా అవసరం. ఇలాంటి సమయంలో ఏ.ఆర్ రెహమాన్ తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
రామాయణం చిత్రానికి అద్భుతమైన రీరికార్డంగ్, ట్యూన్లు అందించేందుకు రెహమాన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం టెక్నాలజీతో అంటకాగే ఆయన ప్రస్తుతం 40 రోజుల పాటు `డిజిటల్ డిటాక్స్` చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
డిజిటల్ డిటాక్స్ అంటే.. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఇతర డిజిటల్ పరికరాలకు నిర్ణీత కాలం పాటు దూరంగా ఉండటం. తద్వారా మానసిక ప్రశాంతతను పొందడం.. సృజనాత్మకతను పెంపొందించుకోవడం .. వ్యక్తిగత ఏకాగ్రతను పెంచుకోవడం ప్రధాన అజెండా.
రామాయణం కోసమేనా ఈ కఠిన నిర్ణయం?
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం `రామాయణం` టీజర్ లాంచ్ లేదా గ్రాండ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథకు ఆత్మ వంటి సంగీతాన్ని అందించే క్రమంలో ఆయన శబ్ధాలకు దూరంగా ఉండదలిచారు. గజిబిజి రణగొణ ధ్వనుల ప్రపంచం, సోషల్ మీడియా గందరగోళానికి దూరంగా ఉండి పూర్తిగా పనిపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్‌తో కలిసి పని చేస్తున్న తరుణంలో.. ఈ స్థాయి ప్రాజెక్టుకు అత్యున్నతమైన ఏకాగ్రత అవసరమని రెహ్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెహమాన్ తన కెరీర్ లో ఎన్నో క్లాసిక్ సాంగ్స్ అందించగలిగారంటే, ఆయన శూన్యం నుంచి సంగీత ధ్వనుల్ని సృజిస్తారు గనుక. ఈ ఫార్ములాను ఏ ఇతర సంగీత దర్శకుడు అనుసరించడం అంత సులువేమీ కాదు. గతంలో కూడా డిటాక్స్ తరహాలో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతను ఇచ్చే పద్ధతులను రెహమాన్ అనుసరించేవారు. ఆయన ఎల్లపుడూ రాత్రి సమయాల్లో పని చేస్తూ.. పగలు ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. తాజా డిటాక్స్ కార్యక్రమంలో 40 రోజుల విరామం ఆయనను కొత్తగా రీఛార్జ్ చేయడమే కాకుండా క్రియేటివ్ గా రీరికార్డింగ్, ట్యూన్స్ ఇచ్చేందుకు సహకరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇన్ని రోజులు ఆయన కేవలం సంగీతంతోనే కాలం గడపనున్నారు. మరోసారి తమ ఫేవరెట్ రెహమాన్ నుంచి ఉర్రూతలూగించే సంగీతం వినాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆయన ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం అందించిన చికిరీ బాణీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ - సామాజిక మాధ్యమాలలో ఈ సాంగ్ టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.
