బడా వ్యాపారి వారసురాలు.. సొంత బ్రాండ్ ఉన్న సచిన్ కాబోయే కోడలు
సానియా చందోక్ తాత ప్రముఖ వ్యాపారి రవి ఘాయ్. వీరి కుటుంబానికి హాస్పిటలాటీ, ఫుడ్ బిజినెస్ లున్నాయి.
By: Tupaki Desk | 14 Aug 2025 7:00 PM ISTక్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (25) కాబోయే భార్య ఎవరన్నది అందరికీ ఆసక్తే కదా..? క్రికెట్ దేవుడు కాబోయే కోడలి నేపథ్యం ఏమిటన్నది అభిమానులు కుతూహలంతో చూస్తారు కదా.. ?బుధవారం చడీ చప్పుడు లేకుండా అర్జున్ నిశ్చితార్థం ముంబైకే చెందిన సానియా చందోక్ తో జరిగింది. దీంతో ఎవరీ సానియా అనే ఆరాలు తీయడం మొదలైంది.
సొంతంగానూ నిలదొక్కుకునేలా...
సానియా చందోక్ తాత ప్రముఖ వ్యాపారి రవి ఘాయ్. వీరి కుటుంబానికి హాస్పిటలాటీ, ఫుడ్ బిజినెస్ లున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ వీరిదే. అయితే, తన పెద్దలపైన ఆధారపడకుండా సానియా సొంత కాళ్లపై నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ లో భాగస్వామి మాత్రమే కాక డైరెక్టర్ కావడం విశేషం. సానియా చాలా లో ప్రొఫెల్ లో ఉంటారు. అందుకే సచిన్ స్థాయి వ్యక్తి కుమారుడితో వివాహం నిశ్చితార్థం అయినా పెద్దగా వివరాలు బయటకు రాలేదు.
ఆమె సంస్థ ఏం చేస్తుంది..??
సానియా నడుపుతున్న సంస్థ పెంపుడు జంతువుల పోషణ -సంరక్షణ చూస్తుంది. ఇక వీరి కుటుంబం ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇంతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారాలు చేస్తోంది. పలు వ్యాపార రంగాల్లో విజయవంతం అయ్యారు. సానియా తాత రవి ఘాయ్ గ్రావిస్ గ్రూప్ చైర్మన్. బ్రూక్లిన్ క్రీమరీతో పాటు క్వాలిటీ ఐస్ క్రీం కూడా వీరిదే అని తెలుస్తోంది.
అక్క స్నేహితురాలు..
సానియా చందోక్.. అర్జున్ సోదరి సారా టెండూల్కర్ కు స్నేహితురాలు. ఇక అర్జున్-సానియా నిశ్చితార్థంను కావాలనే గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఇప్పటివరకు అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. ఇక అర్జున్ టెండూల్కర్ ముంబైలో పుట్టి పెరిగినా దేశవాళీ క్రికెట్ లో ప్రస్తుతం గోవాకు ఆడుతున్నాడు. ఎడమచేతివాటం పేసర్, బ్యాట్స్ మన్ అయిన అర్జున్.. 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో 37 వికెట్లు తీశాడు. 532 పరుగులు చేశాడు. 24 టి20 మ్యాచ్ లలో 27 వికెట్లు పడగొట్టాడు. 119 పరుగులు చేశాడు. 2021 నుంచి ఐపీఎల్ లో ముంబై జట్టులో ఉన్నాడు.
