అర్జున్ విజయంతో నందమూరి కల్యాణ్ రామ్ ఆనందం.. క్లైమాక్స్‌పై ఓ స్పెషల్ కామెంట్!
ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. "నేను ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను. నా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.
By: Tupaki Desk | 19 April 2025 10:44 PM ISTగత కొన్ని రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడలేదు. అసలే సమ్మర్ సీజన్. డిఫరెంట్ మాస్ కంటెంట్ సినిమా కోసం ఎక్కువమంది ఎదురుచూస్తున్నారు. ఇక మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి టైమ్ లో ఇరు వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా. నందమూరి కల్యాణ్ రామ్, లెజెండరీ నటి విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
విడుదల రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బ్లాక్‌బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించి, విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పిన సమయంలోనే ఆయనలో స్పార్క్ కనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ కోసం ప్రత్యేకమైన విజువల్ కావాలని కోరుకున్నాం. అప్పుడు రైటర్ శ్రీకాంత్ విస్సా ఇచ్చిన క్లైమాక్స్ ఐడియా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ సన్నివేశం గురించి అందరూ మాట్లాడుతున్నారు" అని తెలిపారు.
ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. "నేను ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను. నా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మంగళవారం లేదా బుధవారం నాటికి సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని వారు చెప్పారు. మా హార్డ్ వర్క్ ఫలితంగా ఈ విజయాన్ని చూడడం చాలా సంతృప్తిగా ఉంది" అంటూ కల్యాణ్ రామ్ స్పష్టంగా తెలిపారు.
ఇక విజయశాంతి కూడా ఈ విజయంపై స్పందిస్తూ, చిత్రబృందంలోని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కొన్ని నెగిటివ్ ప్రచారాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. "సినిమా పై, ఇతర సినిమాలపై అసత్యంగా ప్రచారం చేస్తున్న వారిని చూసి బాధగా ఉంది. అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఇకనైనా మారాలి. ఏ సినిమా మీదైనా ఇలా కామెంట్స్ చేస్తే క్షమించం. సరైన చర్యలు తీసుకుంటాం" అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.
ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా తల్లీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కల్యాణ్ రామ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే విజయశాంతి పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొత్తానికి అర్జున్ సన్నాఫ్ వైజయంతి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు మాస్ యాక్షన్‌ను సమంగా మిక్స్ చేసిన సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెగిటివ్ ట్రోల్స్ ఉంటూనే ఉన్నా.. సినిమా జాతర కొనసాగుతోంది. ఇక ఈ వారం వసూళ్లు కూడా మంచి స్థాయిలో నమోదయ్యేలా కనిపిస్తోంది. కల్యాణ్ రామ్, విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా వేసవిలో ఓ సేఫ్ బెట్ గా నిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
