నెగెటివిటీ ఎంత ఎదురైనా ఎక్కడో పాజిటివిటీ ఉంటుంది: అర్జున్
ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. సినిమా సక్సెస్ సందర్భంగా నిర్వహించిన థాంక్స్ మీట్ లో అర్జున్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.
By: Sivaji Kontham | 16 Feb 2026 12:58 AM ISTయాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన `సీతాపయనం` ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. సినిమా సక్సెస్ సందర్భంగా నిర్వహించిన థాంక్స్ మీట్ లో అర్జున్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.
థాంక్స్ మీట్‌లో అర్జున్ మాట్లాడిన విషయాలు ఆసక్తిని కలిగించాయి. ఆయన మాట్లాడుతూ-``మా నాన్న నటుడు శక్తి ప్రసాద్ కన్నడ పరిశ్రమలో 220 సినిమాల్లో నటించారు. నాన్న గారికి నేను సినిమా రంగానికి రావడమే ఇష్టం లేదు..
నన్ను పోలీస్ అధికారిగా చూడాలనుకునేవారు. ఆయన ఒక మాట చెప్పేవారు నాకు.. మనకు ఒక్కో విషయం నెగెటివ్ గా కనబడుతుంది లైఫ్ లో.. చూడటానికి ఎక్కడో నెగెటివ్ గా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక పాయింట్ లో పాజిటివిటీ ఉంటుంది..ఆ ఒక్క పాయింటే నా పాత్ర ఈ సినిమాలో`` అని తెలిపారు.
సీతాపయనం చిత్రాన్ని కేవలం ఒక సినిమాగా కాకుండా, సమాజానికి మంచి సందేశం ఇచ్చే ప్రయత్నంగా తెరకెక్కించానని అర్జున్ చెప్పారు. ఈ సినిమాకు విమర్శకుల నుండి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా నటీనటుల ప్రదర్శనను మెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు.
తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటనకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు ఒక తండ్రిగా తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఈ సినిమాలో గోసంరక్షణ మరియు భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలకు లభిస్తున్న స్పందన తనకెంతో తృప్తినిచ్చిందని అర్జున్ వెల్లడించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన అద్భుతమైన మెలోడీలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఆయన కొనియాడారు.ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సమావేశంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్, సాయి మాధవ్ భుర్రా, అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
