'4రోజుల్లో రూ.4కోట్ల వసూళ్లు?'.. పోస్టర్లపై అర్జున్ సర్జా అభిప్రాయమేంటి?
ప్రస్తుతం సినిమా విడుదలైన వెంటనే భారీ వసూళ్ల పోస్టర్లు విడుదల చేయడం సాధారణంగా మారిన నేపథ్యంలో.. అలాంటి ప్రమోషన్స్ పై తన అభిప్రాయాన్ని అర్జున్ సర్జా క్లియర్ గా వెల్లడించారు.
By: M Prashanth | 2 Jun 2026 3:00 PM ISTయాక్షన్ కింగ్ అర్జున్ సర్జా చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం సినిమా విడుదలైన వెంటనే భారీ వసూళ్ల పోస్టర్లు విడుదల చేయడం సాధారణంగా మారిన నేపథ్యంలో.. అలాంటి ప్రమోషన్స్ పై తన అభిప్రాయాన్ని అర్జున్ సర్జా క్లియర్ గా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అర్జున్ సర్జా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన చిత్రం సీతాపయనం. లవ్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇండియన్ కల్చర్, సనాతన ధర్మం వంటి ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతోనే అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు.
రీసెంట్ గా సినిమా మార్కెటింగ్ విషయంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు అర్జున్ సర్జా. "సీతాపయనం విడుదల సమయంలో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ నాలుగు రోజుల్లో రూ.4 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ విడుదల చేద్దామని సూచించింది. నాకు అసలు అంత డబ్బులు రావు. అందుకే ఒప్పుకోలేదు నేను. చల్ రే అంటూ రిజెక్ట్ చేశా" అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ నెంబర్స్ విషయంలో ఫేక్ ప్రచారం జరుగుతుందనే అభిప్రాయం ఎప్పటికప్పుడు తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్ల కంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు వ్యాఖ్యల ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక సీతాపయనంలో కన్నడ నటుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించగా, ఐశ్వర్య అర్జున్ సీత పాత్రలో కనిపించింది.
అర్జున్ సర్జాతో పాటు ఆయన అల్లుడు ధృవ సర్జా కూడా గెస్ట్ రోల్ లో సందడి చేశారు. ప్రకాష్ రాజ్, సత్యరాజ్, కోవై సరళ, సుమిత్ర, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించగా, రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. కథ విషయానికి వస్తే, ప్రమాదం నుంచి బయటపడిన సీత తనను రక్షించిన వారికి థ్యాంక్స్ చెప్పేందుకు ప్రయాణం ప్రారంభిస్తుంది.
ఆ సమయంలో అభి అనే యువకుడితో పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే అతడు దాచిన ఒక నిజం బయటపడిన తర్వాత సీత తీసుకున్న నిర్ణయం చుట్టూ కథ సాగుతుంది. సినిమాలో ఫ్యామిలీ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, గోసంరక్షణ, సనాతన ధర్మం వంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడం, స్లో స్క్రీన్‌ప్లే వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఏదేమైనా సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా సరే, ఒరిజినల్ కలెక్షన్లకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఫేక్ ప్రమోషన్స్ ద్వారా సక్సెస్ చూపించే ప్రయత్నాలు చేయకూడదని అర్జున్ సర్జా ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు అప్పుడప్పుడు వస్తున్నట్లు కొందరు భావిస్తున్న ఫేక్ పోస్టర్ల మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.
