Begin typing your search above and press return to search.

తెలుగు దర్శకుడిని కాకా పడుతున్న బాలీవుడ్‌ హీరో!

ఇటీవల బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగపై స్పందించాడు.

By:  Tupaki Desk   |   16 April 2025 10:30 AM
తెలుగు దర్శకుడిని కాకా పడుతున్న బాలీవుడ్‌ హీరో!
X

అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడంతో అక్కడ కూడా స్టార్‌ దర్శకుడిగా మారిపోయాడు. కబీర్‌ సింగ్‌ సినిమాతో బాలీవుడ్‌లో పరిచయం కావడంతో పాటు, స్టార్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగ తాజాగా రణబీర్‌ కపూర్‌తో యానిమల్‌ సినిమాతో తన స్థానంను మరింత పదిలం చేసుకున్నాడు. హిట్స్ లేక ఢీలా పడ్డ బాలీవుడ్‌కి యానిమల్‌తో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని ఇవ్వడంతో సందీప్ రెడ్డి వంగపై హిందీ స్టార్స్‌లో నమ్మకం పెరిగింది. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు రెడీ అన్నట్లుగా ఇండైరెక్ట్‌ హింట్స్ ఇస్తున్నారు.

ఇటీవల బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగపై స్పందించాడు. యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి సినిమాలను చూస్తూ ఉంటే పిచ్చెక్కుతుందని, ఆయన సన్నివేశాల్లో హీరోల ప్రవర్తన, వారి ఆలోచన తీరు ఆశ్చర్యకంగా ఉంటుందని అర్జున్‌ కపూర్‌ అన్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాలో సందీప్ రెడ్డి వంగ హీరో పాత్రను చూపించిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కొన్ని బోల్డ్‌ సన్నివేశాల్లో హీరోను చూపించి, జనాలను మెప్పించడం కేవలం సందీప్‌కి మాత్రమే చెల్లింది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డి/కబీర్‌ సింగ్‌ సినిమాలోని హీరో పాత్ర ట్రెండ్‌ సెట్టర్‌ అనడంలో సందేహం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సందీప్ వంగ సినిమాల్లో హీరోల చర్యలతో నేను ఏకీభవించను. కానీ వారు ఆలోచించే తీరు, ఒక సంఘటన జరిగినప్పుడు వారు ఆలోచించే విధానం తనకు నచ్చుతుందని అర్జున్‌ కపూర్‌ అన్నాడు. ఆయన సినిమాల్లో ఎడిటింగ్‌, ఫ్రేమింగ్‌, విజువల్స్‌, ఆడియో ఇలా ప్రతి ఒక్కటి చాలా స్పెషల్‌గా ఉంటాయని అర్జున్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు. యానిమల్‌ సినిమాలో ఒక ఫైట్‌ సన్నివేశంలో హీరోను చూపించిన తీరును నేను ఎప్పటికీ మరచి పోలేను అంటూ అర్జున్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ పై అర్జున్‌ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక దర్శకుడి గురించి నటుడు ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు అంటే కచ్చితంగా అతడి దర్శకత్వంలో ఈ నటుడు నటించాలని ఆశ పడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అర్జున్‌ కపూర్‌ కెరీర్‌లో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. అందుకే ఆయన సందీప్‌ రెడ్డి వంగ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో హీరోగా లేదా విలన్‌గా అయినా నటించే అవకాశం దక్కితే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉండి ఉంటారు. అందుకే సందీప్ రెడ్డిని అర్జున్ కపూర్‌ కాకా పడుతున్నట్లుగా తాజా వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సందీప్ వంగ ప్రస్తుతం ఉన్న బిజీ నేపథ్యంలో ఇప్పట్లో అర్జున్‌ కపూర్‌తో సినిమా చేసే అవకాశం లేదు. తన సినిమాల్లో ఏమైనా విలన్‌ వేశాలు ఉంటే అప్పుడు అర్జున్‌ కపూర్‌ను సందీప్‌ వంగ పరిశీలిస్తాడేమో చూడాలి.