కాపీ ట్యూన్‌తో దొరికిపోయిన ఆస్కార్ గ్రహీత
సంగీత ప్రపంచంలో అతడు ఒక సంచలనం. దశాబ్ధాల పాటు పాటల పూదోటలో మెరిసిన గొప్ప మెరుపు.
By: Tupaki Desk | 26 April 2025 9:24 AM ISTసంగీత ప్రపంచంలో అతడు ఒక సంచలనం. దశాబ్ధాల పాటు పాటల పూదోటలో మెరిసిన గొప్ప మెరుపు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న అతడు ఇప్పుడు కాపీ రైట్ చట్టం కారణంగా కోర్టు ముందు మోకరిల్లాల్సి వచ్చింది. అంతేకాదు కోర్టుకు 2 కోట్లు డిపాజిట్ చేసి, ప్రత్యర్థికి 2 లక్షలు ఖర్చులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ మేరకు కోర్టు రెహమాన్ కు తాఖీదు జారీ చేసింది.
ఇదంతా ఏఆర్ రెహమాన్-డాగర్ కేసు గురించిన కథ. తాజాగా దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పులో రెహమాన్ ఒక భక్తి పాటను కాపీ చేసాడని నిరూపణ అయింది. `వీర రాజ వీర` పాట కాపీరైట్ వివాదంలో ఏఆర్ రెహమాన్ రూ.2 కోట్లు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మణిరత్నం తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్ 2`లో పాపులర్ ట్రాక్ `వీర రాజ వీర`ను కాపీ చేశారని, తన దివంగత తండ్రి సహా మేనమామ కూర్చిన శివ స్తుతి నుండి రెహమాన్ ట్యూన్ ని కాపీ చేశారని డాగర్ ఆరోపించారు. దీనిపై విచారించిన కోర్టు ఇరు పాటలను పరిశీలించి అంతిమంగా రెహమాన్ ను దోషిగా తేల్చింది. `వీర రాజ వీర` పాట `శివ స్తుతి`కి సరి సమానంగా ఉందని నిర్ధారించింది కోర్టు చిన్న లిరికల్ మార్పులను మినహాయించి పాటకు ట్యూన్ కట్టిన విధానం, లయ ప్రతిదీ ఒరిజినల్ పాటతో పోలి ఉందని, అందువల్ల కాపీరైట్ ఉల్లంఘన చేసినట్టేనని కోర్టు నిర్ధారించింది. పరిహారంగా రెహమాన్ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ కోర్టు రిజిస్ట్రీలో రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని, అదనంగా, డాగర్ కుటుంబానికి రూ. 2 లక్షల ఖర్చులు చెల్లించాలని జడ్జి తీర్పునిచ్చారు.
అంతేకాదు ఓటీటీ డిజిటల్ మీడియాల్లో క్రెడిట్‌లను సరి చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దివంగత ఉస్తాద్ ఎన్ ఫైయాజుద్దీన్ డాగర్, దివంగత ఉస్తాద్ జహీరుద్దీన్ డాగర్ రాసిన శివ స్తుతి ఆధారంగానే పీఎస్ 2లో పాటకు ట్యూన్ కట్టారని చివరికి విచారణలో నిరూపణ అయింది. కాపీరైట్ చట్టం ప్రకారం భారతీయ శాస్త్రీయ కూర్పులను రక్షించాల్సి ఉందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే రెహమాన్.. ఆయన బృందం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. వీర రాజ వీర 13వ శతాబ్దపు నారాయణ పండితాచార్య రచన నుండి ప్రేరణ పొందిందని వారు వాదిస్తున్నారు. డబ్బు కోసమే డాగర్ ఈ కేసును నడిపిస్తున్నారని రెహమాన్ బృందం వాదిస్తున్నారు.
