Begin typing your search above and press return to search.

ఘాటు విమర్శలు.. అయినా చలించని రెహమాన్

తాజాగా తనను విమర్శించిన గాయకుడు అభిజిత్ తన మీద చేసిన విమర్శల విషయంలోనూ రెహమాన్ ఇంతే సున్నితంగా స్పందించాడు.

By:  Tupaki Desk   |   17 April 2025 8:15 AM IST
ఘాటు విమర్శలు.. అయినా చలించని రెహమాన్
X

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మధ్య తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వట్లేదనే విమర్శలున్నాయి. ఒకప్పుడు రెహమాన్ ఎంత గొప్ప ఆల్బమ్స్ ఇచ్చాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ కొన్నేళ్ల నుంచి రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం సాధారణంగా ఉంటున్న మాట వాస్తవం. ఐతే ఎవరైనా తనను సంగీతం విషయంలో విమర్శించిన రెహమాన్ స్పందించడు. సున్నిత మనస్కుడిగా కనిపించే రెహమాన్.. తన విమర్శకులకు బదులిచ్చిన సందర్భాలు దాదాపుగా కనిపించవు.

ఆస్కార్ అవార్డు అందుకున్నాక నేరుగా చెన్నైకి రాకుండా ఇంకెక్కడో సన్మానం అందుకున్నందుకు తనను సీనియర్ నటుడు రాధారవి ఘాటుగా విమర్శిస్తే.. దాని మీద కూడా సరదాగానే స్పందించడం రెహమాన్‌కే చెల్లింది. తాజాగా తనను విమర్శించిన గాయకుడు అభిజిత్ తన మీద చేసిన విమర్శల విషయంలోనూ రెహమాన్ ఇంతే సున్నితంగా స్పందించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిజిత్ మాట్లాడుతూ.. రెహమాన్ ఎక్కువగా టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాడని, గాయనీ గాయకులకు బదులు సాంకేతికతను ఉపయోగించి వారి ఉపాధిని దెబ్బ తీస్తున్నారని అభిజిత్ విమర్శించాడు. దీనిపై రెహమాన్ తాజాగా స్పందించాడు. ‘‘అన్ని విషయాలకూ నన్ను తప్పుబట్టడం బాగానే ఉంది. అభిజిత్ నా మీద ఎలాంటి విమర్శలు చేసినా ఆయన్ని నేను గౌరవిస్తూనే ఉంటా. ఆయన అంటే నాకెంతో అభిమానం.

ప్రేమతో ఆయనకు స్వీట్స్ పంపుతా. నా పని మీద ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని ఆ విధంగా బయటపెట్టారు. దాన్ని నేను ఏమాత్రం తప్పుబట్టను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది’’ అని రెహమాన్ అన్నాడు. ఎవరెంతగా విమర్శించినా ఇంత ఓపికతో మాట్లాడ్డం రెహమాన్‌కే చెల్లిందని.. అందుకే ఆయన ఆ స్థాయికి చేరుకోగలిగాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు.