మ్యూజిక్ లో రెహమాన్ కొత్త ప్రయోగం
గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న జెనరేషన్ లో ఫ్యూచర్ మొత్తం ఏఐతోనే నడిచేట్లుంది.
By: Tupaki Desk | 19 April 2025 5:00 PM ISTగత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న జెనరేషన్ లో ఫ్యూచర్ మొత్తం ఏఐతోనే నడిచేట్లుంది. దీంతో సినీ ఇండస్ట్రీలో కూడా ఏఐ వాడకం బాగా పెరిగిపోతుంది. హాలీవుడ్ లో గత కొంత కాలంగా ఏఐ వాడుతున్నప్పటికీ, ఇండియన్ సినిమా కూడా మెల్లిగా ఏఐ టెక్నాలజీకి అలవాటు పడుతోంది.
ఇటీవల కాలంలో సంగీత దర్శకులు తమ సాంగ్స్ కోసం చనిపోయిన సింగర్ల గొంతును ఏఐ ద్వారా వాడుతుండటం మనం చూస్తున్నాం. అయితే దీనిపై ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్పందించి మాట్లాడారు. అసలు ఈ ఏఐ వాడి ఎవరు సాంగ్స్ ను క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదని, ఫేమస్ సింగర్స్ గొంతు వాడి వాటిని క్రియేట్ చేసినప్పటికీ అందులో కొన్ని చాలా అసహ్యంగా ఉన్నాయని, వీటి బాధ్యతను ఎవరు తీసుకుంటారో తనకు తెలియదు కానీ వీలైనంత త్వరగా వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరముందని, లేకపోతే లేనిపోని గందరగోళం ఏర్పడుతుందని రెహమాన్ తెలిపారు.
దాంతో పాటూ మెటా హ్యూమన్స్ ప్రాజెక్ట్ లో భాగమైన తన లేటెస్ట్ గ్లోబల్ మ్యూజికల్ బ్యాండ్ గురించి కూడా రెహమాన్ మాట్లాడారు. ఈ బ్యాండ్ లో వరల్డ్ వైడ్ గా ప్రజలకు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే ఆరుగురు వర్చువల్ మ్యూజిషియన్స్ ఉంటారని, ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఏఐ జెనరేటెడ్ విజువల్స్ ను మాత్రమే మనం చూశామని, ఇప్పుడు ఏఐ జెనరేటెడ్ మ్యూజిక్ ను కూడా చూసే టైమ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
రీసెంట్ గా ఓ యూట్యూబ్ లో షో లో రెహమాన్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా తాను ఏఐతో ఆడుకుంటున్నానని వెల్లడించారు. తాను మెటా హ్యూమన్లతో ఓ వర్చువల్ బ్యాండ్ ను క్రియేట్ చేస్తున్నానని, అది చాలా డిఫరెంట్ బ్యాండ్ అని, అందులోని మ్యూజియన్లంతా వర్చువల్ ప్రపంచంలోని వాళ్లే అని రెహమాన్ తెలిపారు.
ఈ ఇయర్ ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో రెహమాన్ ఈ మెటాహ్యూమన్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. గత 30 ఏళ్లుగా ఇండియన్ సినీ మ్యూజిక్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన రెహమాన్, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన సత్తాను మరింత చాటనున్నట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే రెహమాన్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
