Begin typing your search above and press return to search.

మురుగ‌దాస్‌కిది లాస్ట్‌ఛాన్స్ కానుందా?

ద‌ర్శ‌కుడిగా మురుగ‌దాస్‌కు ఈ సినిమాలు త‌మిళ, తెలుగు భాష‌ల్లోనే కాకుండా హిందీలోనూ రికార్డు స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకుని ద‌ర్శ‌కుడిగా తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టాయి.

By:  Tupaki Desk   |   15 April 2025 2:00 PM IST
AR Murugadoss Comeback Film
X

క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌కు సామాజికి అంశాల్ని జోడించి ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ని రూపొందించిన ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌. మురుగ‌దాస్‌. ఆయ‌న చేసిన ర‌మ‌ణ (తెలుగులో ఠాగూర్‌), గ‌జిని, తుపాకి, క‌త్తి వంటి సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయో అంద‌రికి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా మురుగ‌దాస్‌కు ఈ సినిమాలు త‌మిళ, తెలుగు భాష‌ల్లోనే కాకుండా హిందీలోనూ రికార్డు స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకుని ద‌ర్శ‌కుడిగా తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టాయి.

అయితే ఇది నిన్న‌టి క‌థ‌. ఇప్పుడు టైమ్ మారింది. ఆయన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించ‌డం లేదు. వ‌రుస‌గా ఫ్లాప్‌లే ఎదుర‌వుతున్నాయి. `క‌త్తి` త‌రువాత మురుగ‌దాస్ హిట్ అనే మాట విని ప‌దేళ్ల‌కు పైనే అవుతోంది. ఇటీవ‌ల నాలుగేళ్ల విరామం త‌రువాత బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో `సికింద‌ర్‌` మూవీ చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆయ‌న‌తో పాటు ఆయ‌న సినిమాలు ఇష్ట‌ప‌డే ప్రేక్షకులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. సల్మాన్ ఖాన్ కూడా దీంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నుకున్నారు.

రానీ నో యూజ్‌. అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ‌మైన ఫ్లాప్‌గా నిలిచి మురుదాస్‌కు, స‌ల్మాన్‌కు షాక్ ఇచ్చింది. దీంతో అందిరి దృష్టి ఇప్పుడు `మ‌ద‌రాసి`పై ప‌డింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న శివ‌కార్తికేయ‌న్ `అమ‌ర‌న్‌` త‌రువాత చేస్తున్న సినిమా ఇది. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మ‌రో 15 శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి మేక‌ర్స్ ఈ మూవీని సెప్టెంబ‌ర్ 5న రిలీజ్‌చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

గ‌త ప‌దేళ్లుగా వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న మురుగ‌దాస్‌కిది `డూ ఆర్ డై` ఫిల్మ్ ఇది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ఆయ‌న‌కు ఓ లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సోలోగా ఎలాంటి పోటీ లేని స‌మ‌యంలో ఈ మూవీని రిలీజ్‌చేయ‌బోతున్నారు. సూర్య 45, స‌ర్దార్ 2 దీపావ‌ళికి రిలీజ్ కానుండ‌టంతో వాటితో క్లాష్ ఇష్టం లేక వాటికి ముందుగానే సెప్టెంబ‌ర్‌లో `మ‌ద‌రాసి`ని రిలీజ్ చేయ‌బోతున్నారు. శివ‌కార్తికేయ‌న్ ట్రాక్ రికార్డ్ ఫాలో అవుతూ `మ‌ద‌రాసి` కూడా అదే త‌ర‌హాలో హిట్ అయి మురుదాస్ కెరీర్‌కు మళ్లీ ఊపునిస్తుందా? అనే చ‌ర్చ ఇప్పుడు కోలీవుడ్‌లో న‌డుస్తోంది. అంతా భావిస్తున్న‌ట్టే మురుగ‌దాస్ ఈ సినిమాతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా? అన్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.