మెగా మూవీ ముచ్చట్లు... కుండలు లేక ఇక్కట్లు
తాజాగా ఆ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అప్పటి సంగతులు ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి.
By: Tupaki Desk | 17 Jun 2025 1:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. ఆయన చేసిన పాత్రలు, ఆయన మార్క్ డాన్స్ చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. ఒకానొక సమయంలో ఇండియాలో బచ్చన్ కంటే పెద్ద స్టార్ అంటూ పేరు దక్కించుకున్నాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ఆపద్బాంధవుడు'. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చిరు కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించి, ఎప్పటికి నిలిచి పోయేలా చేసిన కె విశ్వనాథ్ ఆ సినిమాలోని ఒక సీన్ కోసం చాలా కష్టపడ్డారట, ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
తాజాగా ఆ సినిమా గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అప్పటి సంగతులు ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తాయి. పాత సినిమాలు, సూపర్ హిట్ సినిమాల మేకింగ్ గురించి తెలుసుకునేందుకు ప్రస్తుత తరం ఫిల్మ్ మేకర్స్ సైతం ఆసక్తిని కనబర్చుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా సంగతులు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ ఆర్ట్ ఫిల్మ్స్ మేకర్‌గా కె విశ్వనాథ్ గారికి మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గకుండా చిరంజీవి సినిమా కనుక కాస్త మాస్ టచ్ ఇవ్వాలి అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగా యాక్షన్ సీన్స్‌ను ప్లాన్ చేశాడు.
1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి ఒక సన్నివేశంలో ఎద్దుతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. కుండల మధ్యలో చిరంజీవి ఎద్దుతో పోరాటం చేసే సీన్‌కి మంచి స్పందన దక్కింది. ఆ సీన్ అంత మంచిగా రావడం వెనుక చాలా ఇబ్బందులు ఉన్నాయట. ఆ సన్నివేశం కోసం ఏకంగా ఆరు వేల కుండలను కొనుగోలు చేశారట. అందుకు గాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దాదాపుగా రూ.50 వేలు ఖర్చు చేసిందట. డబ్బు విషయం పక్కన పెడితే కొన్ని కారణాల వల్ల ఎద్దుతో చిరంజీవి ఫైట్ ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి వచ్చిందట. దాంతో కుండలు పదే పదే పలగడం, వాటి స్థానంలో కొత్తవి పెట్టడం చేయాల్సి వచ్చిందట.
నాలుగు రోజుల షూటింగ్ తర్వాత కోసం చెన్నైలో ఉన్న కుండలన్నీ తీసుకు వచ్చారు. ఆ తర్వాత కూడా ఇంకా కుండలు కావాల్సి ఉన్నా చెన్నైలో ఎక్కడ కుండలు దొరకలేదు. దాంతో పూర్ణోదయ ప్రొడక్షన్ టీం మెంబర్స్ చెన్నై శివారు ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో తిరిగి అయిదు... పది కుండల చొప్పున సమీకరించారట. ఆ కుండలను తీసుకు వచ్చేందుకు చాలా ఖర్చు అయిందట. కుండల ఖర్చు కంటే ట్రాన్స్‌పోర్ట్ ఎక్కువ అయిందని అంటారు. ఒక సీన్ కోసం ఏదో కానిచ్చేశాం అనకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చేస్తేనే అలాంటి సక్సెస్‌లు వస్తాయి.
కుండలు పూర్తి కాగానే సరే ఉన్న వాటితో మ్యానేజ్ చేద్దాం.. అనుకుని ఉంటే ఈ రోజుకు ఆ సీన్ గుర్తు పెట్టుకోక పోయే వాళ్లం. అందుకే ప్రతి సీన్ ను పర్ఫెక్షన్‌తో తీస్తే మంచి ఫలితం నమోదు అవుతుంది. గొప్ప దర్శకులు కె విశ్వనాథ్ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. అందులో ఆపద్బాంధవుడు ఒకటి. ఆయన మృతి చెందినా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉండటం ద్వారా ఆయన బతికి ఉన్నట్లే..!
