‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీపై దాఖలైన పిల్ కొట్టేసిన ఏపీ హైకోర్టు
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంపై దాఖలైన పిల్ ను కొట్టేసింది ఏపీ హైకోర్టు.
By: Tupaki Desk | 30 March 2025 10:44 AM ISTసంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంపై దాఖలైన పిల్ ను కొట్టేసింది ఏపీ హైకోర్టు. అదే సమయంలో పిటిషనర్ కోరినట్లుగా సినిమాల నిర్మాణ ఖర్చుపై దర్యాప్తును ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం అధికార యంత్రాంగం పరిధిలోనిదని చెప్పిన హైకోర్టు.. తమ ముందు ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేయాలా? లేదా? అనే విషయాలు దర్యాప్తు సంస్థలే డిసైడ్ చేసుకుంటాయని తెలిపింది.
సినిమా నిర్మాణ ఖర్చుపై ఈడీతో దర్యాప్తు చేయాలని ఆదేశించటం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయటమే అవుతందని చెప్పిన హైకోర్టు.. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషన్ తీరును ఆక్షేపించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ ధర పెంపును.. అదనపు షోలకు అనుమతిస్తూ జనవరి 8న ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ ను తాజాగా హైకోర్టు కొట్టేసింది. విజయవాడకుచెందిన ఎం.లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆయన తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రత్యేకన్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. ఈ మధ్యన తీర్పును రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు తాజాగా పిల్ ను కొట్టేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ ప్రాథమిక ఆధారాలు సమర్పించకుండా.. ఊహాజనిత ఆరోపణలతో పిల్ దాఖలు చేసి.. దర్యాప్తు జరపాలని కోరుతున్న తీరును తప్పు పట్టింది.
‘టికెట్ ధరల పెంపు విసయంలో విచారించాల్సిందేమీ లేదు. అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తైంది. ఈ పిల్ ప్రచారం కోసం దాఖలు చేసింది’ అంటూ వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. జస్టిస్ చీమలపాటి రవితోకూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి టికెట్ ధర పెంపుతో పాటు.. అదనపు షోలకు పద్నాలుగు రోజులకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కారు విడుదల చేసిన జీవోను తప్పు పడుతూ ఈ పిల్ ను దాఖలు చేయటం తెలిసిందే.
