వీరమల్లు ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్.. టికెట్ల రేట్లు ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ 'హరిహర వీరమల్లు' విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచింది.
By: Tupaki Desk | 19 July 2025 5:02 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ 'హరిహర వీరమల్లు' విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల జోరును పెంచింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. చిత్రీకరణలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
లేటెస్ట్ గా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాకు మొదటి 10 రోజుల పాటు స్పెషల్ గా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ల ధర రూ.100, అప్పర్ క్లాస్ ధర రూ.150 వరకు అదనంగా పెంచుకునే అవకాశం ఉంది. అదే విధంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో అయితే రూ.200 వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా, ఈ సినిమాను ముందుగానే చూడాలని అనుకునే అభిమానుల కోసం పలు స్పెషల్ షోలు కూడా ప్లాన్ చేశారు. విడుదలకు ఒక రోజు ముందే.. జూలై 23వ తేదీనే రాత్రి 9.30 గంటలకు ప్రత్యేకంగా పెయిడ్ ప్రీమియర్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక షోల టికెట్ల ధర రూ.600 (జీఎస్టీ కలుపుకుని) వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే, విడుదల రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక తెలంగాణలో టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. చిత్ర బృందం తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన సినిమా కావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా పాజిటివ్ గా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
