Begin typing your search above and press return to search.

అనుష్క లేకుండానే 'ఘాటి' రానుందా?

ఘాటి సినిమాను జులై 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమా విడుదలకు నాలుగు వారాల సమయం ఉంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 7:13 PM IST
అనుష్క లేకుండానే ఘాటి రానుందా?
X

అనుష్క ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. టాలీవుడ్‌లో ఈమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏడాదికి నాలుగు, అయిదు సినిమాలు చేసినా అభిమానులు ఆధరించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తే వందల కోట్ల వసూళ్లు ఇచ్చేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం చాలా రేర్‌గా సినిమాలు చేస్తుంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క నుంచి పాన్‌ ఇండియా సినిమాలు వరుసగా వస్తాయని అంతా ఎదురు చూశారు. కానీ ఆ సినిమా తర్వాతే అనుష్క సినిమాల సంఖ్య చాలా తగ్గించింది. అనుష్క సినిమాల్లో నటించడం తగ్గించడంకు కారణం ఏంటి అనేది బేతాల రహస్యంగా మారింది.

అనుష్క చివరగా 2023లో మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతకు ముందు అంటే 2020 సంవత్సరంలో నిశబ్దం సినిమాతో వచ్చింది. ఆ సమయంలో కరోన కారణంగా నిశబ్దం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అయింది. థియేట్రికల్‌ రిలీజ్‌ను అభిమానులు మిస్ అయ్యారు. 2018లో వచ్చిన భాగమతి సినిమాతో అనుష్క చివరగా విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి అనుష్క కోసం అభిమానులు, ఆమె సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత అనుష్క నుంచి ఘాటి సినిమా రాబోతుంది. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించడం విశేషం.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న కిష్‌ దర్శకత్వంలో గతంలో అనుష్క వేదం సినిమాలో నటించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అనుష్క, క్రిష్ కాంబోలో ఈ సినిమా రూపొందింది. పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాను వదిలేసి మరీ దర్శకుడు క్రిష్ ఘాటి సినిమాను రూపొందించాడు. సినిమా షూటింగ్‌ సైలెంట్‌గా ప్రారంభించాడు. మధ్యలో అనుష్క బర్త్‌డే సందర్భంగా గ్లిమ్స్ విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశాడు. అత్యంత హింసాత్మకంగా ఆ గ్లిమ్స్ ఉండటంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అనుష్క పాత్ర మరో లెవల్‌ అన్నట్లుగా ఉంటుందని గ్లిమ్స్ ను చూస్తే అనిపిస్తుంది.

ఘాటి సినిమాను జులై 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సినిమా విడుదలకు నాలుగు వారాల సమయం ఉంది. ఈ సినిమాను తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌కి అనుష్క వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ప్రమోషన్‌లో అనుష్క యాక్టివ్‌గా పాల్గొనలేదు. నవీన్ పొలిశెట్టి ప్రమోషన్‌ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఇప్పుడు ఘాటి సినిమా ప్రమోషన్‌ బాధ్యతను అనుష్క తీసుకుంటుందా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆమె లుక్‌ విషయంలో, ఆమె ఆరోగ్యం విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కనుక ఘాటి సినిమాను అనుష్క ప్రమోషన్స్‌కు రాకుండానే రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి అలా చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.