Begin typing your search above and press return to search.

సందీప్ వంగాని డిఫెండ్ చేసిన అనురాగ్

దర్శక నిర్మాత అనురాగ్ మ‌రిన్ని విష‌యాలు మాట్లాడుతూ.. నైతికతపై ప్రకటన చేసే బాధ్యతను సినిమాలు ఎలా నెత్తికెత్తుకోవో మాట్లాడాడు

By:  Tupaki Desk   |   5 Dec 2023 4:44 AM GMT
సందీప్ వంగాని డిఫెండ్ చేసిన అనురాగ్
X

రణబీర్ కపూర్ నటించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ వ‌సూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం ర‌ణ‌బీర్ మునుపటి బెస్ట్ ఓపెనర్ చిత్రం 'బ్రహ్మాస్త్ర - పార్ట్ వన్: శివ' రికార్డును బ్రేక్ చేసింది. బ్ర‌హ్మాస్త్ర కంటే రూ. 10 కోట్లు అధికంగా ఓపెనింగ్ ని రాబ‌ట్టి ఓపెనింగ్ వీకెండ్ లో 100 కోట్ల నెట్ వ‌సూలు చేసింది. సందీప్ రెడ్డి వంగా ర‌ణ‌బీర్ ఆశించిన పాన్ ఇండియా విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాడు. ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ న‌ట‌న‌ను, యాక్షన్‌ను చూడటానికి ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్‌లకు తరలివస్తుండగా, కొంద‌రు సాంప్ర‌దాయవాదులు మాత్రం ఈ చిత్రాన్ని స్త్రీద్వేషంతో విషపూరితమైన మగతనం చూపించార‌ని కామెంట్ చేస్తున్నారు. కబీర్ సింగ్ తర‌హాలోనే యానిమ‌ల్ పై రాంగ్ సైడ్ ప్ర‌చారం ఉన్నా, వ‌సూళ్ల‌లో మాత్రం దూకుడు త‌గ్గ‌డం లేదు.

తాజాగా ప్ర‌ముఖ జాతీయ మీడియాతో చాట్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ కశ్యప్ సినిమాలోని హింసాత్మక స‌న్నివేశాలు, శృంగార కంటెంట్ పై నిందలు వేస్తున్న వారిపై స్పందించారు. అనురాగ్ మాట్లాడుతూ-''యానిమ‌ల్ పై ఆన్‌లైన్‌లో జరుగుతున్న సంభాషణల గురించి నాకు తెలుసు. ఒక సినిమా నిర్మాత ఎలాంటి సినిమాలు తీయాలి.. ఎలాంటివి తీయకూడదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఈ దేశంలోని ప్రజలు సినిమాలతో తేలిగ్గా మనస్తాపం చెందుతారు. నా సినిమాల విష‌యంలోను వాళ్లు (ప్ర‌జ‌లు) బాధపడతారు. కానీ విద్యావంతులు ఎంతమాత్రం బాధపడకూడదని నేను ఆశిస్తున్నాను''అని అన్నారు.

షాహిద్ కపూర్ 'కబీర్ సింగ్' విడుదలైన తర్వాత ప్ర‌జ‌ల ధోరణి విమ‌ర్శ‌ల‌ను కూడా అనురాగ్ గుర్తుచేసాడు. రెచ్చగొట్టే సినిమాలకు కూడా ఎలా చోటు ఇవ్వాలి? అనే దాని గురించి మాట్లాడుతూ -''ఈ చర్చ కబీర్ సింగ్ సమయంలో కూడా జరిగింది. ఫిల్మ్ మేకర్స్‌కి వారు కోరుకున్న ఏదైనా సినిమా తీయడానికి.. వారు కోరుకున్న దానికి ప్రాతినిధ్యం వహించే హక్కు ఉంది. మనం వారిని విమర్శించవచ్చు.. వాదించవచ్చు లేదా విభేదించవచ్చు. సినిమాలు రెచ్చగొట్టడం లేదా ప్రేరేపించడం క‌థ‌లో భాగం. రెచ్చగొట్టే సినిమాలను తీసే దర్శకనిర్మాతలతో నాకు ఎలాంటి సమస్య లేదు. ప్ర‌జ‌లు దీనిపై రాద్ధాంతం చేయ‌కూడ‌దు'' అని అన్నారు.

దర్శక నిర్మాత అనురాగ్ మ‌రిన్ని విష‌యాలు మాట్లాడుతూ.. నైతికతపై ప్రకటన చేసే బాధ్యతను సినిమాలు ఎలా నెత్తికెత్తుకోవో మాట్లాడాడు. ''నైతికత అంటే ఏమిటి? ఇది మ‌న‌లో మ‌నం త‌ర‌చి చూసుకునే విషయం. ఈ సమాజంలో అన్ని రకాల పాత్రలు, అన్నిర‌కాల‌ వ్యక్తులు ఉన్నారు. భారతీయ పురుషులలో 80 శాతం మంది కబీర్ సింగ్ లాంటి వారే. సబ్జెక్ట్‌తో నాకు సమస్య లేదు''అని సంఘాన్ని ఎత్తి చూపాడు.''ఆ చిత్రంలో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే క‌బీర్ పాత్రతో ఇతర పాత్రలకు ఏజన్సీ లేదు. ప్ర‌ధాన‌ పాత్ర(క‌బీర్ సింగ్‌)ను ఆసరా చేసుకోవడానికి మాత్రమే వాటిని ఉపయోగించారు. అది జరగాల్సిన చర్చ. కానీ ఇంకేదో చ‌ర్చించారు. సినిమాల‌పై ఆరోగ్యకరమైన చర్చలు జరగాలి. మేము నిలబడి ఒకరినొకరు విమ‌ర్శించుకోలేం'' అని అన్నారు.

నేను చూసిన‌ ఏదైనా సినిమాతో సమస్య ఉంటే ఎప్పుడూ చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాతకి ఫోన్ చేసి మాట్లాడతాను. నేను సోషల్ మీడియా కబుర్లలోకి రావాలనుకోను అని కూడా అనురాగ్ అన్నారు. షూటింగ్ బిజీలో ఉన్నందున యానిమ‌ల్ ని ఇంకా చూడ‌లేద‌ని, సినిమా చూశాక ద‌ర్శ‌క‌నిర్మాత‌లతో మాట్లాడ‌తాన‌ని కూడా అనురాగ్ తెలిపారు. యానిమల్ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద నాలుగో రోజు అంటే సోమవారం టెస్ట్‌లో పాస్ య్యి అత్యధిక స్కోర్‌ సాధించింది. నాలుగో రోజు ఏకంగా రూ. 39.9 కోట్లు సంపాదించింది. ఇప్ప‌టికే ఈ చిత్రం 100కోట్ల నెట్ క్ల‌బ్ లో చేరింది.