Begin typing your search above and press return to search.

విలన్ కూతురి పెళ్లి కోసం సేతుపతి సాయం

నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఒక సౌత్ హీరోపై తన కృతజ్ఞతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచారు

By:  Tupaki Desk   |   12 May 2025 10:43 AM IST
విలన్ కూతురి పెళ్లి కోసం సేతుపతి సాయం
X

నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఒక సౌత్ హీరోపై తన కృతజ్ఞతను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచారు. 'ఇమైక్కా నొడిగల్' చిత్రం తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి అనురాగ్‌కు వరుసగా నటనా ఆఫర్లు వస్తుండగా, ఆయనకు నటనపై ఆసక్తి లేకపోవడంతో చాలావరకు వాటిని తిరస్కరించారు. కానీ 'మహారాజ' అనే చిత్రంతో ఆయన నటుడిగా మరోసారి అందరికీ గుర్తిండిపోయేలా నటించారు.

నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా, అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా అలరించారు. ఆ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమాలో నటించడం వెనక ఒక ఎమోషనల్ మూమెంట్ ఉందని తాజాగా అనురాగ్ వెల్లడించారు.

తన కుమార్తె వివాహానికి అవసరమైన డబ్బు తన వద్ద లేనప్పటికీ, విజయ్ సేతుపతికి చెప్పగానే ఆయన ముందుగానే సాయమందించారని చెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం అనురాగ్ తన దర్శకత్వం వహించిన ‘కెన్నడీ’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చెన్నై వచ్చినప్పుడు విజయ్ సేతుపతితో భేటీ అయినట్లు చెప్పారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని పేర్కొన్నారు.

అదే సమయంలో ‘మహారాజ’ సినిమా నుంచి వచ్చిన ఆఫర్‌ను అనురాగ్ మొదట తిరస్కరించారని చెప్పారు. అయితే విజయ్ సేతుపతి ఒత్తిడితో ఆ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు. ఆ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తోనే తన కుమార్తె వివాహం ఘనంగా నిర్వహించగలిగానని అనురాగ్ ఉద్వేగంగా తెలిపారు.

ఆ సమయానికి విజయ్ సేతుపతిగారి మద్దతు లేకపోతే నా కుటుంబం ఆ ఆనందాన్ని చూడలేకపోయేదే. అలాంటి మానవత్వం ఉన్న వ్యక్తిని కలవడం అదృష్టం అంటూ ఆయన అభినందనలు తెలిపారు. ఈ అనుభవం తాను ఎప్పటికీ మర్చిపోలేనిదని అన్నారు. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బెగ్గర్ అనే సినిమాకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.