స్టార్ పవర్ చూసి ఆడియో ధర నిర్ణయిస్తారు!
ఇటీవల బాలీవుడ్ ని విడిచి పొరుగు పరిశ్రమలకు వెళ్లిపోయిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వీలున్న ప్రతి వేదికపైనా హిందీ చిత్రసీమ విష సంస్కృతిని తూర్పారబడుతున్నారు
By: Tupaki Desk | 16 July 2025 8:15 AM ISTఉన్న మాటను ముక్కుసూటిగా అనేయడం కొందరికే చెల్లుతుంది. ఇటీవల బాలీవుడ్ ని విడిచి పొరుగు పరిశ్రమలకు వెళ్లిపోయిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వీలున్న ప్రతి వేదికపైనా హిందీ చిత్రసీమ విష సంస్కృతిని తూర్పారబడుతున్నారు. బాలీవుడ్ లో విష సంస్కృతి కారణంగా చాలా మంది పెద్ద ఫిలింమేకర్స్ ఇండస్ట్రీ వదిలి విదేశాలకు వెళ్లిపోయారని దెప్పి పొడిచారు. తాను పొరుగు నుంచి తిరిగి బాలీవుడ్ కి రానని అన్నారు.
ఇప్పుడు ప్రముఖ ఆడియో కంపెనీ - టీ-సిరీస్ అన్యాయాన్ని ప్రశ్నించారు. తాను దర్శకత్వం వహించిన మంచి సినిమాలకు ఆడియో హక్కుల ధరను సరిగా చెల్లించలేదని తెలిపారు. దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, గులాల్ చిత్రాల సంగీతం ఎంతో అద్భుతంగా ఉంటుందని, కానీ టి సిరీస్ సరిగా ధరలు చెల్లించలేదని తెలిపారు. బాంబే వెల్వెట్ కి పెద్ద ధర చెల్లించారు. అందులో పాటలు బావున్నా కానీ జాజ్ సంగీతం పెద్దగా ఎక్కలేదు. కానీ దేవ్ డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ కి మాత్రం చెల్లించలేదు! అని ఆరోపించారు.
స్టార్ పవర్ చూసి ఆడియో హక్కులకు ధరలు నిర్ణయిస్తారని కూడా ఎద్దేవా చేసారు అనురాగ్ కశ్యప్. టి- సిరీస్ సంస్థ ఇలాంటి పనులు చేస్తుందని విమర్శించారు. టి సిరీస్ వాళ్లకు మంచి సంగీతం అర్థం కాదని కూడా పంచ్ వేసారు. మంచి పాటలకు అభిరుచితో చెల్లింపులు చేయాలని కూడా ఆయన మాటల్లో ఆవేదన కనిపించింది. ప్రస్తుతం అనురాగ్ డెకాయిట్ (టాలీవుడ్) అనే చిత్రంలో నటిస్తున్నాడు. వన్ టు వన్ అనే తమిళ చిత్రంలోను నటిస్తున్నాడు. ప్రస్తుతానికి దర్శకత్వానికి బ్రేకిచ్చాడు.
