ఆ సూపర్‌హిట్లు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ కావు.. సీఈఓపై అనురాగ్ ఫైర్
సబ్‌స్క్రిప్షన్ పై ఉన్న శ్రద్ధ వినియోగదారులకు మంచి కంటెంట్ ఇవ్వాలనే దానిపై లేదని అనురాగ్ ఫైర్ అయ్యారు.
By: Tupaki Desk | 13 July 2025 7:00 AM ISTతాను తీసిన సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొందారు ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఆయన కేవలం డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో నటుడిగా కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు. ఎప్పుడూ ఏవో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అనురాగ్ కశ్యప్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ కథలు, క్రియేటివిటీపై నెట్‌ఫ్లిక్స్ సీఈఓ సరండోస్ కు ఏ మాత్రం క్లారిటీ లేదన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ఆఫీస్ లోని టీమ్ ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్ముతూ ఎప్పుడూ ఒకే లాంటి చెత్త కంటెంట్ ను అందిస్తుంటారని, మన టీవీల్లో వచ్చే చెత్త కంటెంట్‌నే వాళ్లు ఓటీటీ వేదికగా అందిస్తున్నారని అనురాగ్ కశ్యప్ నెట్‌ఫ్లిక్స్ పై అసహనం వ్యక్తం చేశారు.
టీవీల్లో వచ్చే కంటెంట్ ను స్ట్రీమింగ్ చేస్తూ మన నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని, సబ్‌స్క్రిప్షన్ పై ఉన్న శ్రద్ధ వినియోగదారులకు మంచి కంటెంట్ ఇవ్వాలనే దానిపై లేదని అనురాగ్ ఫైర్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్ లో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న స్వ్కిడ్ గేమ్, అడాల్‌సెన్స్, బ్లాక్ వారెంట్ లాంటివన్నీ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ కాదని, అదంతా నెట్‌ఫ్లిక్స్ వేరే దగ్గర నుంచి కొనుక్కున్న కంటెంటేనని ఆయన అన్నారు.
ఇండియాలో ఓటీటీలు మొదలైన కొత్తల్లో కంటెంట్ చాలా ఫ్రెష్ గా, కొత్తగా ఉంటూనే ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయని, నెట్‌ఫ్లిక్స్ లో కంటెంట్ చూడటం కంటే కొరియన్ కంటెంట్ చూడ్డానికే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని అనురాగ్ అన్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ పై అనురాగ్ ఇలాంటి కామెంట్స్ చేయడం మొదటిసారేమీ కాదు. గతంలో అడాల్‌సెన్స్ రిలీజైన టైమ్ లో నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి కంటెంట్ ను అందించకపోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
