Begin typing your search above and press return to search.

సెన్సార్‌ బోర్డ్‌ మోసపూరిత వ్యవస్థ...!

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియా ద్వారా 'ఫూలే' సినిమా వివాదం గురించి స్పందించాడు.

By:  Tupaki Desk   |   17 April 2025 8:00 PM IST
Anurag Kashyap Reacts On CBFC
X

ఈమధ్య కాలంలో చాలా సినిమాలు సెన్సార్‌ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సోషల్‌ మీడియా పరిధి పెరగడంతో చిన్న వివాదం కాస్త పెద్దగా మారడంతో పాటు, సినిమాలను బ్యాన్ చేయడం, ఆందోళనకు దిగడం, థియేటర్‌ల వద్ద విద్వంసంకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దాంతో సెన్సార్‌ బోర్డ్‌ ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. సెన్సార్‌ బోర్డ్‌ వద్దకు సినిమా వచ్చిన సమయంలోనే ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసం ఏ చిన్న విషయంలోనూ రాజీ పడటం లేదు. వివాదం అనిపిస్తే డైలాగ్‌లను మార్పించడం, సన్నివేశాలను కట్‌ చేయడం చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ 'ఫూలే' సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొంటుంది.

ఏప్రిల్‌ 11న విడుదల కావాల్సిన ఫూలే సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు కొన్ని కట్స్ చేప్పడంతో పాటు, కొన్ని డైలాగ్స్‌ను మార్చమని సూచించారట. అందుకు దర్శకుడు నిరాకరించాడు. ముఖ్యంగా 3 వేల సంవత్సరాల గులామీ అనే డైలాగ్‌ను కొన్ని సంవత్సరాల గులామీ అంటూ మార్చాలని సెన్సార్‌ బోర్డ్‌ సూచించింది. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మణ సంఘాలను అవమానించినట్లుగా డైలాగ్స్‌ ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. అందుకే సెన్సార్‌ బోర్డ్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌కి అడ్డంకులు చెప్పింది. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే వంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను తీసిన సమయంలో ఇలాంటి అడ్డంకులు రావడం విడ్డూరంగా ఉందని బాలీవుడ్‌ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియా ద్వారా 'ఫూలే' సినిమా వివాదం గురించి స్పందించాడు. ముఖ్యంగా సెన్సార్‌ బోర్డ్‌ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెన్సార్‌ బోర్డ్‌ అనేది ఒక మోసపూరిత వ్యవస్థ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. సెన్సార్‌ బోర్డ్‌కి సినిమా వెళ్లినప్పుడు వారు నలుగురు కాకుండా ఇతరులకు ఎలా కథ, అందులోని విషయాలు తెలుస్తున్నాయి అంటూ అనురాగ్‌ కశ్యప్‌ ప్రశ్నించాడు. సినిమాలో ఎలాంటి విషయాలు ఉన్నాయి అనేది సెన్సార్‌ బోర్డ్‌కి కాకుండా బయటి వ్యక్తులకు ఎలా తెలిసింది. సెన్సార్‌ బోర్డ్‌ వారి వల్లే బయటి వ్యక్తులకు ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి. ఈ వివాదానికి కారణం సెన్సార్‌ బోర్డ్‌ అంటూ అనురాగ్‌ కశ్యప్‌ వ్యాఖ్యలు చేశాడు.

అనురాగ్‌ కశ్యప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో... నా జీవితంలో మొదటి నాటకంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే జీవిత కథను నాటకంగా చేశాను. ఈ దేశంలో కులవాదం లేకపోతే అప్పుడు ఎవరి గురించి వారు పోరాటం చేసి ఉంటారు. మనం చూడలేక పోతున్న వేరే బ్రహ్మణులు మన దేశంలో ఉన్నారా అంటూ ఆయన ప్రశ్నించాడు. ఫూలే సినిమాను వ్యతిరేకించిన వారు కుల వ్యవస్థను సమర్ధించిన వారే అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఎంతో మంది ప్రముఖులు సైతం ఫూలే సినిమా వివాదంపై స్పందిస్తున్నారు.