ఆస్కార్ రగడ: కశ్యప్ విమర్శలు.. మరాఠీ డైరెక్టర్ ఫైర్!
దీనిపై `గంధాల్` దర్శకుడు సంతోష్ దావాఖర్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమా చూడకుండా ఎలాంటి తీర్పులు ఇవ్వవద్దని కోరారు.
By: Srikanth Kontham | 24 Sept 2026 12:26 PM IST99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) కి సంబంధించి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో భారతదేశ అధికారిక ఎంట్రీగా మరాఠీ సినిమా `గంధాల్` ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎంపికపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేసారు. భారత్ తరచూ ఆస్కార్‌లకు తప్పు సినిమాలను ఎంపిక చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై `గంధాల్` దర్శకుడు సంతోష్ దావాఖర్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమా చూడకుండా ఎలాంటి తీర్పులు ఇవ్వవద్దని కోరారు.
ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ ఆస్కార్ బరిలో భారత్ ప్రతిసారీ సరైన సినిమాలను పంపడంలో విఫలమవుతోందని ఆరోపించారు. గతంలో `ది లంచ్‌బాక్స్`, `ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్` వంటి ప్రతిభావంతమైన చిత్రాలను ఎంపిక చేసే అవకాశం ఉన్నా? ఎంపిక కమిటీ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. ఎంపిక ప్రక్రియలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని.. దానికి తోడు సరైన అవగాహన లోపించడం కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు.
అలాగే `గంధాల్` సినిమా ఆస్కార్ రేసులో నిలబడాలంటే మొదట అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడాలని.. అమెరికన్ పంపిణీదారులను సంపాదించుకోవాలని అనురాగ్ కశ్యప్ సూచించారు. అప్పుడే ప్రచారానికి పెట్టే ఖర్చుకు సార్థకత ఉంటుందన్నారు. అయితే తాను ఇంకా `గంధాల్` సినిమాను చూడలేదని, కాబట్టి ఆ సినిమాపై నేరుగా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందన్నారు.
అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై గంధాల్ దర్శకుడు సంతోష్ దావాఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో విమాన ప్రయాణంలో అనురాగ్ కశ్యప్‌ను కలిసి తమ సినిమా గురించి పరిచయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో అనురాగ్ తనకు సినిమా గురించి తెలియదని.. తప్పకుండా చూస్తానని చెప్పారని.. అయితే ఈ చిత్రం ఇంకా ముంబైలో రిలీజ్ అవ్వలేదని తెలిపారు.
సినిమాను వీక్షించకుండానే ముగింపునకు రాకూడదని సంతోష్ దావాఖర్ ప్రేక్షకులను, విమర్శకులను కోరారు. మరాఠీ సంస్కృతిని, గ్లోబల్ అప్పీల్‌ను మిళితం చేస్తూ రూపొందించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను ఓటీటీ కోసం కాకుండా బిగ్ స్క్రీన్ అనుభూతి కోసమే నిర్మించామన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యత తమకు తెలుసని దేశ ప్రతిష్ఠను దెబ్బతీయమని హామీ ఇచ్చారు.
`గంధాల్` మహారాష్ట్రలోని సాంప్రదాయ గంధాల్ భక్తి నృత్యం, సంగీతం నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, కిషోర్ కదమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఐఎఫ్‌ఎఫ్‌ఐ చలనచిత్రోత్సవంలో సిల్వర్ పీకాక్ అవార్డును గెలుచుకున్న చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
