బెదిరింపులు వద్దు.. నేను క్షమాపణ కోరుతున్నా: అనురాగ్
ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. అతడు బ్రాహ్మణులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 19 April 2025 1:35 PMమనోభావాలు దెబ్బతినే ఈ కాలంలో సింగిల్ కామెంట్ తో పెద్ద రచ్చవుతోంది. చాలా వివాదాలు ఒకే ఒక్క కామెంట్ తో మొదలై, కోర్టులు కేసులు గొడవలు అంటూ వివాదాలకు అంతూ దరీ లేదు. ఈ తరహా వివాదాల్లో చిక్కుకోవడం అనురాగ్ కశ్యప్ లాంటి అగ్ర దర్శకుడికి కొత్తేమీ కాదు. ఇప్పుడు అతడు బ్రాహ్మణులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్య ఎఫ్.ఐ.ఆర్ దాఖలు వరకూ వెళ్లింది.
'ఫూలే' ప్రచార సమయంలో బ్రాహ్మణ సమాజంపై అనురాగ్ వ్యాఖ్యల కారణంగా తీవ్ర దుమారం చెలరేగింది. అతడిపై దిల్లీ, ముంబైలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. అతడు బ్రాహ్మణులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సెన్సార్ చిక్కుల గురించి ప్రస్థావిస్తూ...''నేను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తాను'' అని అనురాగ్ కామెంట్ చేయడంతో వివాదం తీవ్రమైంది. ఈ ప్రకటన బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అతడు వెంటనే సారీ చెప్పాడు. నా కుమార్తె, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు అత్యాచార బెదిరింపులు, చంపేస్తామని బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన అనురాగ్ తన కుటుంబాన్ని ఈ వివాదం నుండి దూరంగా ఉంచమని ట్రోలర్స్ ని వేడుకున్నాడు. నేను క్షమాపణ కోరుతున్నాను. దీని నుంచి నా కుటుంబాన్ని మినహాయించండి. మహిళలను విడిచిపెట్టండి అని అనురాగ్ అభ్యర్థించారు.
కులం, లింగ అసమానతలను ప్రస్తావిస్తూ రూపొందించిన చిత్రం 'ఫూలే' విడుదలను మహారాష్ట్రలోని బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ జారీ అయింది. ఫూలే మొదట ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉన్నా ఏప్రిల్ 25కి వాయిదా పడింది.