మన సినిమాలను ఇలా తొక్కేస్తారా?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్క్రీన్ల సర్దుబాటు.. షోల కేటాయింపుల వ్యవహారం ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే నిలుస్తుంది.
By: Srikanth Kontham | 14 Jun 2026 9:00 PM ISTభారతీయ చలన చిత్ర పరిశ్రమలో స్క్రీన్ల సర్దుబాటు.. షోల కేటాయింపుల వ్యవహారం ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే నిలుస్తుంది. తాజాగా హాలీవుడ్ చిత్రం `అబ్సెషన్` దేశంలో ఊహించని స్థాయిలో థియేటర్లను ఆక్రమించుకోవడంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక చిత్రాలను పక్కన పెట్టి హాలీవుడ్ చిత్రాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. మన సొంత సినిమాలకు సరైన రీతిలో షోలను కేటాయించకపోతే.. భారతీయ సినిమా రంగం మరింతగా ఎలా వృద్ధి చెందుతుందని? థియేటర్ల యాజమాన్యాలను ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అనురాగ్ కశ్యప్ ఈ థియేట్రికల్ సంక్షోభంపై గళం విప్పారు.
గత వారం తాను దర్శకత్వం వహించిన `బందర్` సినిమాకు తగినన్ని షోలు లభించలేదని.. ఈ వారం కూడా అదే ధోరణి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చిన ఇంతియాజ్ అలీ `మై వాపస్ ఆవుంగా`, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన `గవర్నర్` , సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తెలుగు చిత్రం `సింగ్ గీతం` వంటి క్రేజీ ఇండియన్ సినిమాలకు థియేటర్ల యాజమాన్యాలు నామమాత్రపు స్లాట్లను మాత్రమే కేటాయించడాన్ని అనురాగ్ తీవ్రంగా తప్పుబట్టారు.థియేటర్లలో షోల వివక్ష ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ అనురాగ్ కశ్యప్ కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.
హాలీవుడ్ మూవీ `అబ్సెషన్` కు ప్రధాన మల్టీప్లెక్స్‌లో 6 నుండి 7 షోలు నడుస్తుంటే.. క్రేజీ చిత్రాలైన `మై వాపస్ ఆవుంగా`, `గవర్నర్` చిత్రాలకు ఒకే ఒక్క మార్నింగ్ షోను మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఏమిటంటే? ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన తెలుగు చిత్రం `సింగ్ గీతం`కు బెంగళూరు వంటి మెట్రో నగరంలో అసలు ఒక్క షో కూడా లభించకపోవడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. హాలీవుడ్ క్రేజ్ స్థానిక చిత్రాల మనుగడను ఎలా దెబ్బతీస్తోందో? చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనమని అనురాగ్ అభిప్రాయపడ్డారు.
`అబ్సెషన్` ప్రపంచవ్యాప్తంగానే కాదు. భారతదేశంలో కూడా స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి భారీ ప్రమోషన్లు లేనప్పటికీ మౌత్ టాక్ తోనే చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 నుండి 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్‌ను మేము అర్థం చేసుకోగలమని.. అయితే తక్కువ షోలతో ఎక్కువ కాలం ఈ చిత్రాన్ని నడిపించవచ్చని అనురాగ్ సూచించారు. అలా కాకుండా ఒకేసారి అన్ని షోలను ఒకే హాలీవుడ్ సినిమాకు ఇచ్చేస్తే అదే సమయంలో విడుదలైన 14 స్థానిక చిత్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.
అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదు. ఇది భారతదేశంలోని మిడ్ రేంజ్.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల మేకర్స్ అందరి గొంతుక. ఒకవైపు హాలీవుడ్ మార్కెట్ విస్తరణ, మరోవైపు దేశీయంగా జరుగుతున్న అన్‌సైంటిఫిక్ రిలీజ్ క్లాష్‌ల నడుమ సృజనాత్మక చిత్రాలు థియేటర్లలో కనుమరుగై పోతున్నాయి. సినిమా అనేది వ్యాపారమే అయినా? సొంత కంటెంట్‌ను, ప్రాంతీయ సినిమాలను ప్రోత్సహించనంత కాలం పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారుతుంది. థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికైనా సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
