ప్రముఖ దర్శకుడిపై కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
సమాజంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడం లేదా ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులకు పాల్పడితే చట్టం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
By: Sivaji Kontham | 17 May 2026 11:51 PM ISTసమాజంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడం లేదా ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడటం వంటి పనులకు పాల్పడితే చట్టం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక దేశంలో విభిన్న సంస్కృతులు, ఆచారాలు ఉన్నప్పుడు.. పబ్లిక్ లైఫ్‌లో ఉండే ప్రముఖులు అత్యంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయగల స్థానాల్లో ఉండే సినీ దర్శకులు, నిర్మాతలు లేదా స్టార్ హీరోలు తాము పెద్ద తెరపై ఎలాంటి కంటెంట్ చూపిస్తున్నాం.. సామాజిక మాధ్యమాలలో ఏం మాట్లాడుతున్నాం? అనే విషయాలపై ఆచితూచి వ్యవహరించడం అత్యంత అవసరం. అలా కాకుండా హద్దులు దాటి ప్రవర్తిస్తే లేదా మాటలు జారితే ఎదురయ్యే చట్టపరమైన పర్యవసానాలకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వివాదమే తాజా ఉదాహరణ.
కొన్నేళ్ల క్రితం సామాజిక పరిస్థితులు, పరిధులు వేరుగా ఉండేవి. కానీ నేటి డిజిటల్ విప్లవం.. సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న వ్యాఖ్య లేదా పోస్ట్ క్షణాల్లో దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తోంది. ప్రతి చిన్న అడుగుపైనా నిరంతర నిఘా ఉంటూ రచ్చ పీక్స్‌కు చేరుకోవడమే కాకుండా అది నేరుగా కోర్టు గొడవలకు దారితీస్తోంది. ఇటువంటి సున్నితమైన వాతావరణంలో చిత్ర పరిశ్రమకు చెందిన వారు తమ వ్యక్తిగత అజెండాలను లేదా అక్కసును సామాజిక మాధ్యమాల ద్వారా వెళ్లగక్కితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ పై సూరత్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్.బి.డబ్ల్యూ) జారీ చేయడంతో పాటు క్రిమినల్ కేస్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడం బి-టౌన్‌లో పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఏప్రిల్ 16న హిందీ చిత్రం `ఫులే` ట్రైలర్ విడుదలైన సందర్భంలో.. ఆల్ ఇండియా బ్రాహ్మణ సమాజ్ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందిస్తూ అనురాగ్ కశ్యప్ తన X (ట్విట్టర్) ఖాతాలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని దూషిస్తూ అత్యంత వివాదాస్పద పోస్టులు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు గతంలో కశ్యప్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించి హాజరుకాకపోవడంతో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎ.ఎస్. జాని ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది- విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పి) నాయకుడు కమలేష్ రావల్ దాఖలు చేసిన ఈ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.విభిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం (సెక్షన్ 196), శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం (సెక్షన్ 352) , తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం (సెక్షన్ 353-2) వంటి సెక్షన్లను ఇందులో చేర్చారు.
ఒక సెలబ్రిటీగా ఉండి సమాజంలో విద్వేషాలు రేపడం క్షమించరానిదని... కశ్యప్ 2020లో కూడా హిందువులపై - కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంపై కశ్యప్ గతంలో సోషల్ మీడియాలో నామమాత్రంగా క్షమాపణలు చెప్పినా... లీగల్ నోటీసులకు స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తప్పలేదు.
సినిమా రంగానికి చెందిన దర్శకులు, నటులను చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ గమనిస్తూ అనుకరిస్తూ ఉంటారు. అంతటి భారీ ఫాలోయింగ్ తో బాధ్యత ఉన్న స్థానాల్లో ఉండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ (వ్యక్తీకరణ స్వేచ్ఛ) పేరుతో ఒక సామాజిక వర్గాన్ని నీచంగా చూడటం లేదా అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ సంచలన ఆర్డర్‌పై అనురాగ్ కశ్యప్ ఇంకా మౌనంగానే ఉన్నా.. ఈ పరిణామాలు టాలీవుడ్, బాలీవుడ్ లతో పాటు దేశంలోని ప్రతి ఒక్క మేకర్స్, స్టార్లకు ఒక బలమైన హెచ్చరిక లాంటివని చెప్పాలి.
