క్రియేటివిటీకి సంకెళ్లేస్తే ఎలా? సెన్సార్ బోర్డు పై అనురాగ్ ఫైర్
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, ఇలా అయితే సినిమాలెలా తీస్తామని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 17 July 2025 3:33 PM ISTసెన్సార్ బోర్డు తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరితో పాటూ టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సహా కొందరు సెన్సార్ తీసుకుంటున్న డెసిషన్స్ పై విమర్శలు చేయగా తాజాగా బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ కూడా భారత సెన్సార్ బోర్డు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మలయాళ సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా విషయంలో పురాణాల్లో కనిపించే వ్యక్తుల పేర్లను సినిమాల్లో వాడకూడదని సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా, సురేష్ గోపీ కీలక పాత్రలో నటిస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో హీరోయిన్ పాత్ర పేరు జానకి అని ఉండటం వల్ల అది సీతాదేవికి మరో పేరని ఆ పేరుని తొలగించాలని సెన్సార్ అభ్యంతరం తెలుపగా, ఈ విషయంపై తాజాగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ, ఇలా అయితే సినిమాలెలా తీస్తామని ప్రశ్నించారు. కథలు రాసేటప్పుడు పాత్రలకు పురాణాల్లో ఉన్న పేర్లు పెట్టొద్దని చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని, రియల్ లైఫ్ లో బాగా ఫేమస్ అయిన వారి పాత్రలను, వారి పేర్లను కూడా సినిమాల్లో వాడొద్దని చెప్తారని, పాత్రలను నెగిటివ్ గా చూపించొద్దంటారని, ఇది చేయొద్దు అది చేయొద్దని కండిషన్స్ పెడితే సినిమాలోని పాత్రలకు XYZ, 123, ABC అనే పేర్లు పెట్టాలా?'' అని ఆయన సెన్సార్ బోర్డును ప్రశ్నించారు.
సినిమాలు తీసేది మోరల్ లెసన్స్ చెప్పడానికే అయినప్పటికీ, సమాజంలో మార్పు తేవాలని సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని ఆయన అన్నారు. డైరెక్టర్ నమ్మిన కథను నిజాయితీగా చెప్పడం ఎంతో అవసరమని అప్పుడే సినిమా గెలుస్తుందని అభిప్రాయపడ్డ అనురాగ్ సెన్సార్ బోర్డ్ తో తనకు గతంలో ఎదురైన ఓ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకున్నారు. తన మొదటి సినిమాను సెన్సార్ కు పంపేటప్పుడు అందులోని ఓ పదాన్ని పట్టుకుని సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసిందని, నిజం చెప్పాలంటే మహారాష్ట్రలో ఉన్న సెన్సార్ బోర్డు సభ్యులకు హిందీ సరిగా రాదని, తాము రాసిన దాన్ని వారు వేరేలా భావించి దానికి అభ్యంతరం తెలిపారని, సమస్యను పరిష్కరించేందుకు సెన్సార్ కు తాను హిందీ డిక్షనరీ తీసుకెళ్లాల్సి వచ్చిందని అనురాగ్ వెల్లడించారు. సెన్సార్ బోర్డుపై అనురాగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
