అత్యంత క్రూరమైన మృణాల్‌ని చూపిస్తాడట!
ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా.. నటుడిగా కూడా దక్షిణాదిన బిజీగా మారుతున్నారు.
By: Sivaji Kontham | 13 April 2026 5:00 AM ISTటాలీవుడ్‌లో `సీతారామం`, `హాయ్ నాన్న` వంటి సినిమాలతో పద్ధతిగా.. సున్నితంగా కనిపించే పాత్రలకే పరిమితమైన మృణాల్ ఠాకూర్‌ను భవిష్యత్తులో అత్యంత క్రూరమైన- తీవ్రమైన పాత్రలో చూపించబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హింట్ ఇచ్చారు. మృణాల్ కోసం ఒక సరికొత్త.. అసాధారణమైన కథాంశం తన దగ్గర ఉందని ఈ నటిలోని నటనను మరో కోణంలో ఆవిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు సరదాగా ``మృణాల్ కెరీర్‌ను అనురాగ్ మార్చేయబోతున్నారు`` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా.. నటుడిగా కూడా దక్షిణాదిన బిజీగా మారుతున్నారు. ఇటీవల విడుదలైన `డెకాయిట్` చిత్రంలో అతడి రియలిస్టిక్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దక్షిణాదిన ఆయన పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో కూడా ఆయనకు క్రేజ్ పెరుగుతుండటంతో టాలీవుడ్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో ఆయన భాగం కాబోతున్నారని సమాచారం. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాల్లో అతడి విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌కు దర్శకులు ప్రాధాన్యతనిస్తున్నారు.
దక్షిణాదిన తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అనురాగ్ కశ్యప్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి `మహారాజా` వంటి చిత్రాల్లో విలన్‌గా మెప్పించిన ఆయన మరికొన్ని భారీ తమిళ సినిమాల్లో కీలక పాత్రలకు సంతకం చేశారు. అలాగే మలయాళ చిత్రాల్లోనూ ఆయన ప్రవేశం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు బాలీవుడ్‌లో కల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూనే మరోవైపు సౌత్ సినిమాల్లో నటుడిగా తన రెండో ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు.
ఇక మృణాల్ ఠాకూర్ కెరీర్ విషయానికి వస్తే... ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో నటించిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్ - సౌత్ మధ్య బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవల దేవగన్ సరసన నటించిన `సన్ ఆఫ్ సర్దార్ 2` కూడా విడుదలైంది. కొన్ని తమిళ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను మృణాల్ ఎంచుకుంటోంది.
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీ దశలో ఉంది, ఆమె చేతిలో వైవిధ్యమైన హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్ సరసన డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `హై జవానీ తో ఇష్క్ హోనా హై` ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా.. ఇందులో సరికొత్త గ్లామరస్ రోల్‌లో కనిపించబోతోంది. అలాగే ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ `పూజా మేరీ జాన్` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో మృణాల్ టైటిల్ పాత్రను పోషిస్తోంది. వీటితో పాటు 2027లో విడుదలకు సిద్ధమవుతున్న `రాకా` అనే భారీ ప్రాజెక్టులో బన్నీతో కలిసి నటిస్తోంది. ఈ భారీ చిత్రాలు మృణాల్ ను గ్లామ్ బిజ్ లో మరింత సుస్థిరమైన స్థానంలో నిలబెడతాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అంతేకాదు... అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడు మృణాల్‌ను `బ్రూటల్`గా చూపిస్తానంటే తన కెరీర్‌లో అదొక మేలిమలుపు కావడం ఖాయం. ఒక క్లాసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మృణాల్..అనురాగ్ ప్రపంచంలో క్రూరమైన పాత్రలో ఎలా ఒదిగిపోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తే వినోద రంగంలో అది మరో సంచలనమే అవుతుంది.
