Begin typing your search above and press return to search.

బోల్డ్ రిస్క్.. అమ్మడికి టర్నింగ్ పాయింట్ అవుతుందా?

ఇన్నాళ్లూ పద్ధతిగా ఉండే పాత్రల్లో మాత్రమే నటించిన ప్రేమమ్ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కసారిగా బోల్డ్ క్యారక్టర్ ప్లే చేయటం ఏంటని అందరూ షాక్ అయ్యారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:50 AM GMT
బోల్డ్ రిస్క్.. అమ్మడికి టర్నింగ్ పాయింట్ అవుతుందా?
X

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్'. మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాలతో నిన్న(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ, మొదటి షో నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. ఈ విజయానందంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనుపమ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. "ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. టిల్లు స్క్వేర్ ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్రలో నటించాను. మొదటి నుంచి ఈ క్యారక్టర్ పై నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది” అని చెప్పింది.

'టిల్లు స్క్వేర్' సినిమాలో లిల్లీ అనే పాత్రలో నటించింది అనుపమ పరమేశ్వరన్. ఇప్పటిదాకా ఏ సినిమాలో లేనంత గ్లామరస్ గా కనిపించింది. తన ఇమేజ్ కి విరుద్ధంగా అందాలు ఆరబోయడమే కాదు, సిద్ధూతో కలిసి లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. ఆమె గ్లామర్, పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు ఈ సినిమాకు బిగ్ ప్లస్ అయ్యాయి. అందుకే లిల్లీ క్యారక్టర్ రాసుకున్నప్పుడు 100% ఉంటే, అనుపమ చెయ్యటం వల్ల అది 1000% అయ్యిందని హీరో సిద్ధూ జొన్నలగడ్డ పేర్కొన్నారు.

వాస్తవానికి “టిల్లు స్క్వేర్” ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైనప్పటి నుండి అనుపమ పాత్ర గురించే సోషల్ మీడియాలో ఎక్కువ డిస్కషన్స్ జరిగాయి. ఇన్నాళ్లూ పద్ధతిగా ఉండే పాత్రల్లో మాత్రమే నటించిన ప్రేమమ్ బ్యూటీ.. ఇప్పుడు ఒక్కసారిగా బోల్డ్ క్యారక్టర్ ప్లే చేయటం ఏంటని అందరూ షాక్ అయ్యారు. అందుకే బోల్డ్ పాత్రను పోషించాల్సిన అవసరం ఏమిటని ఇంటర్వ్యూలలో పదే పదే ప్రశ్నించారు. ఇదే విషయం మీద అనుపమ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడింది.

బోల్డ్ రోల్ గురించి మాట్లాడుతూ.. "సినిమా చూసిన తర్వాత ఇప్పుడు అందరూ హ్యాపీగా అడుగుతున్నారు. కానీ ఇంతకముందు ప్రెస్ మీట్ లో అలా అడగలేదు. నేను ఈ క్యారక్టర్ ఎంచుకోకపోతే అది పెద్ద మూర్ఖత్వం అవుతుందని నేను రిలీజ్ కు ముందే ఇంటర్వ్యూలలో చెప్పాను. ఇప్పటి వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ లో ఇది కొత్తగా వుందని మీరే అంటున్నారు కదా.. నేను కూడా అంతే. కథ విన్న వెంటనే ఆ పాత్రని ప్రేమించాను. అది మామూలుగా అందరూ చేసే పాత్ర కాదు, చాలా డిఫెరెంట్ గా ఉండే క్యారక్టర్. లైఫ్ లో మనం రిస్క్ తీసుకుంటేనే కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అనుపమ చెప్పుకొచ్చింది. మరి 'టిల్లు స్క్వేర్'లో ఆమె పోషించిన లిల్లీ పాత్ర కెరీర్ కి ఏవిధంగా ప్లస్ అవుతుందో వేచి చూడాలి.