సురేష్ బాబును కంటతడి పెట్టించిన కథ
ఈ కారణంతో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన పరదా సినిమా గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నట్టు రీసెంట్ గా మేకర్స్ తెలిపారు.
By: Tupaki Desk | 17 July 2025 6:00 PM ISTటాలీవుడ్ లో రిలీజ్ డేట్ల సమస్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ముందు ఓ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం, తర్వాత షూటింగ్ డిలే వల్ల ఆ సినిమా వాయిదా పడటం జరుగుతుంది. దీని వల్ల పెద్ద సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అన్నీ అనుకుని రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న చిన్న, మధ్యతరహా సినిమాలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన పరదా సినిమా గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నట్టు రీసెంట్ గా మేకర్స్ తెలిపారు.
సోషియో డ్రామాగా రూపొందిన పరదా మూవీ ఆగస్ట్ 22న రిలీజ్ కానుండగా రీసెంట్ గా చిత్ర థీమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరదా చిత్ర యూనిట్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరకడానికి ఆరు నెలల టైమ్ పట్టిందని, ప్రతీసారీ ఏదొక మంచి డేట్ ను ఫిక్స్ చేసుకుని ప్రమోషన్స్ కు రెడీ అయేటప్పటికీ వేరే పెద్ద సినిమాలు రావడంతో తమ సినిమాకు థియేటర్లు దొరక్క సినిమా డిలే అవుతూ వచ్చిందని, ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఎవరూ ముందుకు రారని, అదెంత మంచి సినిమా అయినా సరే ఎవరూ రారని, అదే రియాలిటీ అని అనుపమ అన్నారు.
అందరూ పరదా సినిమాను చిన్న సినిమా అంటున్నారు కానీ ఇది మంచి సినిమా అని, చాలా పెద్ద మ్యాటర్ ను పరదా ద్వారా చెప్పబోతున్నామని, సినిమా చూశాక అందరికీ ఈ విషయం అర్థమవుతుందని, సినిమాలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయని అనుపమ అన్నారు. పరదా కథ విన్నాక సురేష్ బాబు కళ్లలో నీళ్లు తిరిగాయని, అది నాకెంతో స్పెషల్ అని డైరెక్టర్ ప్రవీణ్ అన్నారు. సినిమా మొత్తం పరదాలోనే ఉండాలంటే ఎవరూ ఒప్పుకోరని, కానీ అనుపమ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ ను చేశారని, తమ టీమ్ మొత్తానికి ఇది బాహుబలి లాంటి సినిమా అని డైరెక్టర్ చెప్పారు.
పరదా సినిమాతో కొత్త కంటెంట్ ను చెప్పబోతున్నామని, ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదని, సమాజంలో మనకు ఎదురయ్యే సమస్యను ఇందులో చూపిస్తామని, సినిమా రిలీజయ్యాక ఎంతోమంది డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొస్తారని చెప్పిన అనుపమ, సినిమా మొత్తం మీద పరదా వేసుకుని నటించడం ఛాలెంజింగ్ గా అనిపించిందని, అయినా కథ నచ్చడంతో ఎంత కష్టమైనా ఇష్టంగానే చేశానని చెప్పారు. పరదా సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, నటిగా ఇలాంటి పాత్రలు రావడానికి 10 కష్టపడ్డానని, నా టాలెంట్ ను చూపించే అవకాశం ఇన్నాళ్లకొచ్చిందని అనుపమ తెలిపారు.
