అనుపమ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే!
అనుపమ లీడ్ రోల్ లో పరదా అనే సినిమా చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలైన ఈ సినిమా పూర్తై కూడా సంవత్సరమవుతుంది.
By: Tupaki Desk | 18 July 2025 12:37 PM ISTనటులన్న తర్వాత ఎవరికైనా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. నిజమైన నటులెవరైనా ఎప్పుడూ కొత్తగా చేయాలనే పరితపిస్తుంటారు. అయితే అది కేవలం హీరోలకు మాత్రమే కాదు, హీరోయిన్లకు కూడా ఈ తరహా ఆశలుంటాయి. సినిమా కథ మొత్తం తమ పాత్ర చుట్టూనే తిరగాలని, తమపైనే సినిమా కథ ఆధారపడాలని అనుకుంటూ ఉంటారు .
అందులో భాగంగానే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని, వాటితో నటిగా తమని ఇంకా బెటర్ గా నిరూపించుకుని తమ మార్కెట్ ను పెంచుకోవాలని అనుకుంటారు కానీ అందరికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వర్కవుట్ అవ్వవు. అప్పట్లో సావిత్రి, విజయశాంతి, ఆ తర్వాత అనుష్క, నయనతార లాంటి వాళ్లకు కుదిరింది తప్పించి అందరికీ ఈ జానర్ వర్కవుట్ అవదు.
వర్కవుట్ అయినా అవకపోయినా కొందరు కథ నచ్చడం వల్లనో లేదా తమకున్న కోరిక వల్లనో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమను తాము పరీక్షించుకుంటూ ఉంటారు. కానీ సరైన మార్కెట్ లేకపోవడంతో ఆ సినిమాలకు రావాల్సిన ఆదరణ రాదు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ హీరోయిన్లు ఎవరూ దాన్ని చెప్పడానికి ఇష్టపడరు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ విషయంలో ఓపెన్ గా మాట్లాడి వార్తల్లో నిలిచారు.
అనుపమ లీడ్ రోల్ లో పరదా అనే సినిమా చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలైన ఈ సినిమా పూర్తై కూడా సంవత్సరమవుతుంది. కానీ వివిధ కారణాలతో పరదా వాయిదా పడుతూ ఆఖరికి ఆగస్ట్ 22న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనుపమ లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై మాట్లాడారు.
ఒక సినిమా పోస్టర్ మీద కేవలం హీరోయిన్ మాత్రమే ఉంటే ఎవరికీ దానిపై ఇంట్రెస్ట్ రాదని, ఆ సినిమాలను చూడ్డానికి ఎవరూ ముందుకు రారని, ఈ సినిమా కోసం థియేటర్ వరకు వెళ్లాలా అనుకుంటారని అని మొహమాటం లేకుండా ఉన్న నిజాన్ని ఓపెన్ గా చెప్పేశారు అనుపమ. అనుపమ మాటలు విన్న తర్వాత ఇలాంటి నిజాలు ఒప్పుకోవాలన్నా, ఓపెన్ గా మాట్లాడాలన్నా గట్స్ కావాలని, అనుపమను మెచ్చుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలు, హీరో ఓరియెంటెడ్ సినిమాలకు ఉన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ కు ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ఉండదనేది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడరు. కానీ అనుపమ దీన్ని మీడియా ముందుకొచ్చి స్టేజ్ పై చెప్పడం అందరినీ ఆశ్చర్యపరించింది. పరదా గురించి ఎంతో గొప్పగా చెప్తున్న అనుపమకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.
