Begin typing your search above and press return to search.

రూటు మారుస్తున్న ‘జాతిరత్నాలు’ దర్శకుడు

కొవిడ్ టైంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తెలుగు వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి.

By:  Garuda Media   |   31 March 2026 12:00 AM IST
రూటు మారుస్తున్న ‘జాతిరత్నాలు’ దర్శకుడు
X

కొవిడ్ టైంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తెలుగు వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. ఆర్గానిక్ హ్యూమర్‌తో ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. తెలుగులో అప్పటిదాకా వచ్చిన కామెడీ చిత్రాల్లో అదో రకం. ఈ చిత్రంతో దర్శకుడు అనుదీప్ కేవీ పేరు మార్మోగింది. కేవలం తన సినిమాలతోనే కాకుండా.. ఇంటర్వ్యూలు, టీవీ ప్రోగ్రాంలతోనూ అతను కడుపుబ్బ నవ్వించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అనుదీప్‌ను చూడగానే జనాల ముఖాల్లో చిరునవ్వు వచ్చేంతగా అతను పాపులర్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తర్వాత అతడి సినిమాల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ తన ప్రొడక్షన్లో వచ్చిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’నే కాక.. అతను దర్శకత్వం వహించిన ప్రిన్స్, ఫంకీ చిత్రాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఒకే తరహా కామెడీతో అతను త్వరగా ప్రేక్షకులకు మొహం మొత్తేలా చేశాడు. ముఖ్యంగా ‘ఫంకీ’ సినిమా అయితే అనుదీప్ కెరీర్‌నే డోలాయమానంలోకి నెట్టే స్థాయిలో డిజాస్టర్ అయింది. దీంతో ఇకపై అతనేం సినిమాలు తీస్తాడో.. తనకెవరు అవకాశాలు ఇస్తారో అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఐతే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అనుదీప్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడట. ఈసారి అతను తన మార్కు కామెడీ సినిమా తీయబోవడం లేదట. పూర్తిగా రూటు మార్చి ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతన్నాడట అనుదీప్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రకటించబోతున్నారు. మరి అనుదీప్ చిత్రంలో లీడ్ రోల్ చేసే హీరోయిన్ ఎవరో చూడాలి. అనుదీప్ కామెడీ మాత్రమే తీయగలడనే అభిప్రాయంతో ఉన్నారు ప్రేక్షకులు. ఆ మైండ్ సెట్‌ను మార్చడమే కాక.. వేరే జానర్ సినిమాతో మెప్పించి మళ్లీ ఓ హిట్టు కొట్టి బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి అనుదీప్.