Begin typing your search above and press return to search.

'డెవిల్' వివాదం.. ఒరిజినల్ డైరెక్టర్ మరో షాకింగ్ పోస్ట్

అయితే గత కొంతకాలంగా ఈ సినిమా డైరెక్టర్ విషయంలో ఓ వివాదం నడుస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:48 PM GMT
డెవిల్ వివాదం.. ఒరిజినల్ డైరెక్టర్ మరో షాకింగ్ పోస్ట్
X

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ ఈనెల 29న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. బ్రిటిష్ కాలంలో సాగే పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఇన్వెస్టిగేషన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా డైరెక్టర్ విషయంలో ఓ వివాదం నడుస్తూనే ఉంది. మొదట ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహించారు.

మధ్యలో నవీన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని న్యూస్ వచ్చింది. టైటిల్ కార్డ్స్ లో, పోస్టర్స్ లో, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లోనూ నవీన్ పేరు కనిపించలేదు. ఈ సినిమాని నిర్మిస్తున్న అభిషేక్ నామా దర్శకుడిగానూ తన పేరే వేసుకున్నారు. షూటింగ్ సమయంలో నవీన్ కి అభిషేక్ కి మధ్య జరిగిన గొడవలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న డెవిల్ సినిమాకు సంబంధించి డైరెక్టర్ నవీన్ మేడారం తన సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖను రిలీజ్ చేశాడు.

ఇందులో డెవిల్ సినిమా గురించి నవీన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ బహిరంగ లేఖలో నవీన్ పేర్కొంటూ.." డెవిల్ సినిమాకు ప్రాణం పోసేందుకు నేను మూడేళ్లకు పైగా కష్టపడ్డాను. మొదట కాన్సెప్ట్ ఆ తర్వాత స్క్రిప్ట్, కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకోవడం, లొకేషన్స్, సెట్స్ ఇలా ప్రతి అంశంలో నా ప్రమేయం ఉంది. డెవిల్ చిత్రాన్ని మొత్తం నేను 105 రోజుల పాటు వైజాగ్, కరైకుడి, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ లో చిత్రీకరించాను.

కేవలం చిన్న ప్యాచ్ వర్క్ మాత్రం నేను చేయలేదు. డెవిల్ పూర్తిగా నా క్రియేషన్. నాకు ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు, ఇది నా బిడ్డ, ఎవరు ఏమి చెప్పినా, ఇది నవీన్ మేడారం సినిమా. ఇన్ని రోజులపాటు నేను ఓపికతో సైలెంట్ గా ఉన్నాను. నా మౌనాన్ని కొందరు చేతకాని తనంగా భావించారు. ఇప్పుడు చెబుతున్నా డెవిల్ చిత్రం తెరకెక్కించే సమయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. అహంకారం, దురాశతో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగానే నేడు ఇలాంటి వివాదం మొదలైంది.

ఇటీవల ప్రచురితమవుతోన్న కథనాల్లో చెప్పినట్లు.. సినిమా, లేదా చిత్రబృందానికి సంబంధించిన ఏ వ్యక్తిపైనా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. నేను తీసిన సినిమాకు దర్శకుడిగా నాకు క్రెడిట్‌ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. కానీ డెవిల్ చిత్రం వల్ల నాకు వచ్చిన అనుభవం, ప్రతిభ, కాన్ఫిడెన్స్ నాతోనే ఉంటాయి. కళ్యాణ్‌రామ్ సార్ 'డెవిల్‌' కోసం ఎంతో శ్రమించారు. ఈ సినిమా కోసం నాకు అండగా నిలిచిన కళ్యాణ్‌రామ్ సార్‌కి, ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

‘డెవిల్’ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది, డిసెంబర్ 29, 2023న అందరూ థియేటర్లలో సినిమాను చూడాలని కోరుతున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా నా కెరీర్ పైనే ఉంటుంది. నేను కొత్త సినిమాకు సంతకం చేశాను. త్వరలో వివరాలను ప్రకటిస్తాను. ధన్యవాదాలు" అని తెలిపారు.