Begin typing your search above and press return to search.

అత్త ప్రాణం తీసిన‌ వైద్యుడిపై మితిమీరిన నమ్మకం!

అయితే సుదీర్ఘ కాలంగా ఆ కుటుంబానికి తెలిసిన.. వారంతా ఎంతగానో న‌మ్మే ఒక స్థానిక వైద్యుడి సలహాలనే వారు పూర్తిగా పాటించారు.

By:  Srikanth Kontham   |   10 Jun 2026 1:16 PM IST
అత్త ప్రాణం తీసిన‌ వైద్యుడిపై మితిమీరిన నమ్మకం!
X

దక్షిణాది నటి అంజు అరవింద్ తన కుటుంబంలో జరిగిన ఓ తీవ్రమైన విషాదాన్ని.. అందుకు దారితీసిన పరిస్థితులను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన అత్తగారి హఠాన్మరణం తనను..త‌న కుటుంబాన్ని ఎంతగానో కలిచివేసిందని వాపోయారు. ఒక స్థానిక వైద్యుడిపై పెట్టుకున్న మితిమీరిన నమ్మకమే ప్రాణాంతక పరిస్థితికి కారణమైందని.. సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం వల్లే అత్త‌ను కోల్పోవాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. నటి అంజు అరవింద్ వివరణ ప్రకారం.. ఆమె అత్తగారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

అయితే సుదీర్ఘ కాలంగా ఆ కుటుంబానికి తెలిసిన.. వారంతా ఎంతగానో న‌మ్మే ఒక స్థానిక వైద్యుడి సలహాలనే వారు పూర్తిగా పాటించారు. సదరు వైద్యుడు అనారోగ్యాన్ని సాధారణ సమస్యగానే భావించి చికిత్స అందించారని.. తాము కూడా ఆయనపై ఉన్న నమ్మకంతో మరే ఇతర పెద్ద ఆసుపత్రికి వద్దకు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్లలేదని కోడ‌లు అంజు అంగీకరించారు. అయితే రోజులు గడుస్తున్నా అత్త ఆరోగ్యం మెరుగుపడకపోగా పరిస్థితి మరింత విషమించింది. చివరి నిమిషంలో ఆమెను పెద్ద ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వైద్యులు తేల్చి చెప్పారు.

ప్రాథమిక దశలోనే వ్యాధి తీవ్రతను గుర్తించడంలో స్థానిక వైద్యుడు విఫలమయ్యాడని.. ఒకవేళ ముందే జాగ్రత్తపడి కార్పొరేట్ ..స్పెషలిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే అత్త ప్రాణాలు దక్కేవని అంజు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌తో వృద్ధులలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. వ్యాధి లక్షణాలు తగ్గనప్పుడు తక్షణమే ఇతర నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని అంజు హితవు పలికారు. మలయాళం, తమిళం , తెలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన అంజు అరవింద్ ప్రస్తుతం బుల్లితెరపై .. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా బిజీగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన దెబ్బ నుండి కోలుకోవడానికి అంజు ప్రయత్నిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉండే బిజీ లైఫ్ కారణంగా చాలామంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టలేకపోతుంటారని.. కానీ ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల వచ్చే శూన్యాన్ని ఏదీ పూడ్చలేదని.. ఈ సంఘటన తమ కుటుంబానికి పెద్ద పాఠం నేర్పిందని అంజు ముగించారు.